Sanatan Dharma Row:
వ్యాఖ్యల దుమారం..
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై I.N.D.I.A కూటమి నేతలు ఇప్పటికే స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. మతాల్ని రాజకీయాల్ని కలపొద్దని తేల్చి చెప్పింది. ఫలితంగా కూటమిలో క్రమంగా విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్, డీఎమ్‌కే విపక్ష కూటమిలో ఉన్నప్పటికీ ఈ వివాదం విషయంలో మాత్రం అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ వివాదంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని లీడర్స్‌కి హితోపదేశం చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా ఇదంతా బీజేపీ ట్రాప్ అని, అందులో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కూడా ఈ వివాదంపై స్పందించారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం లేకుండా భారత దేశాన్ని ఊహించుకోలేమని తేల్చి చెప్పారు. ఈ ధర్మాన్ని కించపరచడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండి పడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మనోభావాల్ని దెబ్బ తీస్తాయని, రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే ఇలా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లని పదవిలో ఉంచొద్దని అన్నారు.
"సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజం కాదు. దేశంలోని చాలా మంది ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయి. సనాతన ధర్మం లేకుండా భారత్‌ని ఊహించుకోగలమా? ఈ ధర్మాన్ని అవమానపరచడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఓసారి ఎస్‌పీ పార్టీ నేత అవమానిస్తారు. ఇంకోసారి DMK నేత కించపరుస్తారు. వీళ్లంతా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లే కదా. ఇలాంటి వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే పదవి నుంచి తొలగించాల్సిందే"
- ఆచార్య ప్రమోద్, కాంగ్రెస్ నేత