Mumbai News: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ఎదుట మారణ ఆయుధాలతో కాల్పులు జరిపిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాలు తీసుకొనేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. అతను ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉండగా ఈ పని చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అనూజ్ థాపన్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 26న అరెస్టు అయి ప్రస్తుతం ముంబయి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆత్మహత్యాయత్నం తర్వాత అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


ఏప్రిల్ 14న ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర అనూజ్ థాపన్ తో పాటుగా సోను సుభాష్ చందర్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని రకాల ఆయుధాలతో కాల్పులు జరిపారు. మరో ఇద్దరు వ్యక్తులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21) కూడా ఈ కాల్పులు జరిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఘటన జరిగిన రోజు విక్కీ గుప్తా, సాగర్ పాల్ బైక్ పై ఆ ప్రదేశం నుంచి బైక్ పై వెళ్తున్నట్లుగా సీసీటీవీలో పోలీసులు గుర్తించారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నలుగురిని అరెస్టు చేశారు. వీరు నిందితులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో కాంట్రాక్ట్ లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇతను ప్రధాన కార్యకలాపాలలో కిడ్నాప్ లు, హత్య, దోపిడీలు, మోడ్రన్ ఆయుధాల సరఫరా, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ మద్యం అక్రమ రవాణా వంటి నేరాలు ఉన్నాయి.


అనూజ్ థాపన్, సోను సుభాష్ చందర్, విక్కీ గుప్తా, సాగర్ పాల్ లపై ముంబయి పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు కోర్టు పొడిగించింది. ఇంతలోనే అనూజ్‌ థాపన్ పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ముంబయిలోని జీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.