Union Minister Jaishankar: భారత్- చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2020లో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనా ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఇది ఘర్షణకు దారితీసింది. రెండు వైపుల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు సమస్యపై మూడో దేశం జోక్యం అక్కర్లేదని స్పష్టం చేశారు. చైనాతో మాకు సమస్య ఉందని, దానికి మేమిద్దరం పరిష్కారం కనుగొనాలని అన్నారు.
భారత్, చైనా మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించడానికి ఇతర దేశాల వైపు తాము చూడడం లేదన్నారు. పొరుగు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు ఇరువురు పరిష్కారం చూపాల్సి ఉందని ఆయన సోమవారం అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో విలేకరుల సమావేశంలో జైశంకర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించేందుకు ఇతర దేశాల వైపు చూడటం లేదు. చైనాతో భారత్ సంబంధాలు బాగా లేవని కూడా అన్నారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లారు.
మేం చూసుకుంటాం
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, 'భారత్ చైనాల మధ్య సమస్య ఉంది. ఇది మా దేశాల మధ్య నెలకొన్న వివాదం. దాని గురించి ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కొనుగొనడం మా ఇద్దరి బాధ్యత. సహజంగానే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ విషయంలో ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే భారత్, చైనా రెండూ పెద్ద దేశాలు. మన సంబంధాల స్థితి మిగిలిన ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. కానీ, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతర దేశాల వైపు చూడడం లేదు. ఇందులో మూడో దేశం ప్రమేయం అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో రెండుసార్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాను జరిపిన సమావేశాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభనపై చర్చ
జైశంకర్, వాంగ్ యీ గత వారం లావో రాజధానిలో కలుసుకున్నారు. అక్కడ వారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మే 2020లో తూర్పు లడఖ్‌లో సైనిక బలగాలను ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ప్రతిష్టంభనను తొలగించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. సరిహద్దులో శాంతిని తిరిగి తీసుకురావాలని కోరారు. జూలై 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ సందర్భంగా జైశంకర్, వాంగ్ కజకిస్థాన్ రాజధాని అస్తానాలో కలుసుకున్నారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. దశాబ్దాల కాలంలో సరిహద్దులో ఇలాంటి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాలు ఇప్పటివరకు 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి.