Justice Biswanath Rath Comments On Puri Jagannath Ratna Bhandar: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలోని (Puri Jagannath Temple) రహస్య గదిని అధికారుల బృందం ఆదివారం తెరిచిన విషయం తెలిసిందే. స్వామి వారికి చెందిన విలువైన వస్తువుల్ని లెక్కించేందుకు ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ (Jusitice Biswanath Rath) సారథ్యంలో 11 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలోని రహస్య గదిని (Secert Bhandar) ఆదివారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్ సమక్షంలో తెరిచారు. రహస్య బాంఢాగారం తెరిచే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ మాస్కులతో పాటు స్నేక్ హెల్ప్ లైన్ బృందం, విపత్తు సేవల్లో పాల్గొనే జవాన్లను ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచారు. తాజాగా, ఆలయ రహస్య భాండాగారానికి పాములు కాపలా ఉన్నాయన్న ప్రచారాన్ని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తోసిపుచ్చారు.
'ఆ ప్రచారం అవాస్తవం'
'మేజిస్ట్రేట్ సమక్షంలో గది తాళాలు పగలగొట్టిన తర్వాత మా బృందం లోపలికి ప్రవేశించింది. రహస్య గదికి పాములు కాపలా ఉన్నాయన్న ప్రచారం అవాస్తవం. మా బృందంలో ఏడెనిమిది మంది ఆలయ మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నారు. వీరంతా బహుడా యాత్ర సన్నాహాల్లో బిజీగా ఉన్న కారణంగా తనిఖీలు, ఆభరణాల తరలింపునకు తగిన సమయం లభించలేదు. దేవతామూర్తుల, ఆభరణాలు, విలువైన రత్నాల తరలించేందుకు మరో తేదీని నిర్ణయిస్తాం.' అని స్పష్టం చేశారు.
అటు, అవుటర్ ట్రెజరీలో భద్రపరిచిన ఆభరణాలను ఆలయం ప్రాంగణం లోపల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించామని జగన్నాథ ఆలయ పాలనాధికారి అరవింద పాఢి తెలిపారు. అనంతరం మేజిస్ట్రేట్ సమక్షంలో దీనికి సీల్ వేసినట్లు వెల్లడించారు.
వేడుకగా బహుడా యాత్ర..
మరోవైపు, పూరీ జగన్నాథుడు.. బలభద్ర, సుభద్ర, సుదర్శనులతో కలిసి శ్రీ క్షేత్రానికి బయల్దేరారు. బహుడా యాత్రగా పేర్కొనే ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై ఆలయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇదీ జరిగింది..
- ఆదివారం ఉదయం 11 మంది ప్రతినిధులు ముందుగా జగన్నాథుని దర్శనం చేసుకున్నారు. విమలాదేవి, మహాలక్ష్మి ఆలయాల్లో పూజల అనంతరం.. మధ్యాహ్నం 1:28 గంటలకు శుభ ముహూర్తంలో భాండాగారంలోని తొలి రెండు గదులు తెరిపించారు.
- స్వామి నిత్య సేవలు, పండగలు, యాత్రలకు వినియోగించే ఆభరణాలను గర్భగుడికి సమీపంలోని చంగడా గోపురంలో భద్రపరిచారు. ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్కపెట్టెల్లో మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు.
- అనంతరం రహస్య మందిరాన్ని తెరిచి లోపల.. కర్రపెట్టెలు, పురాతన కాలంనాటి ఆల్మరాల్లోని స్వామి సంపదను గమనించారు. అప్పటికే సమయం మించిపోయిందని.. రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని భావించారు.
- మళ్లీ మేజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేసి.. సాయంత్రం 5:20 గంటలకు వెలుపలకు వచ్చారు. కాగా, మూడో రహస్య గదిని చివరిసారిగా 1978లో తెరిచారు.
- రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను త్వరలో లెక్కించనున్నారు. నిధిని తరలించేందుకు చెక్క పెట్టెలను రెడీ చేసినట్లు సీఎంవో తెలిపింది.