Rescue Operation: ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ఉత్తర కాశీ(Uttarkashi) సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు 48 గంటలకు పైగా రెస్క్యూ పనులు (Rescue Operation) కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలినప్పటి నుంచి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. సొరంగంలో పడిపోయిన రాళ్లు, సిమెంట్ కాంక్రీట్‌ను తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. సొరంగంలో 40 మీటర్ల దూరంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి, వారిని కాపాడే మార్గం కోసం ప్రయత్నిస్తున్నారు. 


ఇప్పటి వరకు టన్నెల్‌లో 21 మీటర్ల స్లాబ్‌ను తొలగించామని, 19 మీటర్ల మార్గాన్ని ఇంకా క్లియర్ చేయలేదని అధికారులు తెలిపారు. రెస్క్యూ బృందాలు మొదట్లో 30 మీటర్ల రాళ్లను తొలగించారని, కానీ మరో సారి మట్టి కుంగిపడిననట్లు  చెప్పారు. దీంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. దానితో పాటుకు సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 900 మిల్లీమీటర్ల పైపును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు.  


పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ 108, సొరంగం నిర్మిస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఉద్యోగులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  ఈ ఆపరేషన్‌కు అవసరమైన అన్ని మెటీరియల్‌లు, యంత్రాలను ప్రమాదం జరిగిన ప్రదేశానికి తీసుకు వచ్చారు. 


ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో నీటిపారుదల శాఖకు చెందిన నిపుణులు కూడా పాల్గొన్నారు. భారీ కాంక్రీటు కుప్పలు, ఇనుప కడ్డీలు, శిథిలాలు రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకులుగా మారాయి. టన్నెల్లో చిక్కుకున్న వారిలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖం, హిమాచల్ నుంచి వలస వచ్చిన వారు ఉన్నారు. 


బఫర్ జోన్‌లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నట్లు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంశూ మనీష్ ఖాల్కో తెలిపారు. ఆహారం, నీరు అందిస్తున్నట్లు చెప్పారు. వారు నడవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి దాదాపు 400 మీటర్ల స్థలం ఉందని వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు వాకీ-టాకీస్‌తో కార్మికులతో విజయవంతంగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేశాయి. రేడియో హ్యాండ్‌సెట్‌లను ఉపయోగించి కనెక్ట్ చేయగలిగారు.


కార్మికులను సొరంగం శిథిలాల నుంచి బయటకు తీసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ థామీ, జిల్లా కలెక్టర్ అభిషేక్ రుహేలా సొరంగం వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సంఘటనా స్థలంలో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు సురక్షితంగా బయటపడతారని అన్నారు. 


ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మఖల్‌ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్ గావ్ వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద  చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది. 


సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సొరంగం ఒక్కసారి కూలిపోవడంతో 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు.