TVK Vijay Stampade Death: కరూర్: తమిళనాడులోని కరూర్ లో నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ పొలిటికల్ ర్యాలీ విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో పలువురు స్పృహతప్పి పడిపోయారు. ఊపిరాడక 31 మంది మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నారు. మరో 58 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాట విషాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు, డాక్టర్లను ఆదేశించారు. 

Continues below advertisement

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇవ్వాలని స్టాలిన్ ఆదేశించారు. ఆసుపత్రులలో ఇంటెన్సివ్ వైద్య చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. అంతేకాకుండా, సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Continues below advertisement

అనుమతికి రెట్టింపు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు

ఇంత పెద్ద విషాదంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీలో తొక్కిసలాట ఎందుకు, ఎలా జరిగిందనే ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో తలెత్తుతోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కరూర్ లో విజయ్ ర్యాలీలో మొదట అంచనా వేసిన కంటే ఎక్కువ మంది గుమిగూడారు. పోలీసులు దాదాపు 30,000 మందిని అనుమతించగా, దాదాపు 60,000 మంది విజయ్ కార్నర్ మీటింగ్ ర్యాలీలో పాల్గొన్నారని భావిస్తున్నారు. ఈవెంట్ స్థలాన్ని ఇప్పటికే ఒకసారి మార్చారు. వాస్తవానికి ఈ ర్యాలీ మధ్య కరూర్ లో నిర్వహించాల్సి ఉండగా, రద్దీ, ట్రాఫిక్ ప్రమాదాల గురించి పోలీసులు హెచ్చరించడంతో వేలుచామిపురానికి ప్రచార వేదికను మార్చారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిలో భయాందోళనలువిజయ్ టీవీకే పార్టీ ర్యాలీ రాత్రి 7:20 గంటలకు వేలుచామిపురంలో ప్రారంభమైంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతమంతా చీకటిగా మారడంతో జనసమూహంలో గందరగోళం నెలకొంది. ప్రజలు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి, చాలా మంది పడిపోయారు. ఈ క్రమంలో పలువురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. 

రద్దీ, వెంటిలేషన్ సమస్యవిద్యుత్ సరఫరా నిలిచిపోయిన తరువాత అసలే రద్దీ ఎక్కువ ఉంటడం, వెంటిలేషన్ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చాయని అధికారులు చెబుతున్నారు. వేలాది మంది ఒకేసారి ర్యాలీ ప్రాంగణం నుంచి కదలడంతో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. చాలా మంది స్పృహ కోల్పోగా, వారిని తల్లిదండ్రులు, టీవీకే పార్టీ కార్యకర్తలు చికిత్స కోసం ర్యాలీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలుతరువాత విద్యుత్ పునరుద్ధరించిన తరువాత గుంపును చెదరగొట్టారు. కానీ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన రాజకీయ కార్యక్రమాలలో భద్రత, గుంపు నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదనే ప్రశ్నను లేవనెత్తింది. విజయ్ పార్టీ తమిళనాడు వెట్రి కజగం (టివికె) దీనిపై ఏ విధంగా స్పందిస్తుందని ప్రజలు వేచి చూస్తున్నారు.

అత్యవసర సేవలకు మార్గం కష్టమైందిసంఘటన తరువాత, కరూర్ ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్, పోలీసు వాహనాలకు దారి కోసం సైతం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా మార్గం చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ శనివారం రాత్రి కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, ఇప్పటివరకు తొక్కిసలాటలో 31 మంది మరణించగా, 58 మంది గాయపడి ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం 46 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో, 12 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదివారం నాడు కరూర్ కు రానున్నారని, పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు.

అధికారులు, ప్రభుత్వం స్పందనముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి మరియు మా సుబ్రమణ్యం కరూర్ చేరుకుని సహాయక మరియు వైద్య పనులను పర్యవేక్షించారు. అదనపు డిజిపి కూడా పరిస్థితిని సమీక్షించారు.