భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కొత్త చీఫ్‌గా రవి సిన్హా అనే ఐపీఎస్ అధికారి నియమితులు అయ్యారు. ఆయన ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ IPS అధికారి. సిన్హా నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత RAW చీఫ్ సమంత్ గోయల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.


1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. సిన్హా RAW సెక్రటరీగా రెండేళ్ల పాటు పదవీకాలానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.


జూన్ 30న బాధ్యతలు


ప్రస్తుత RAW చీఫ్ సమంత్ గోయల్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు రవి సిన్హా రా సంస్థ అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిన్హా పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది.


1968లో రా ఏర్పాటు


రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW - Research and Analysis Wing) అనేది భారత గూఢచార సంస్థ. 1962లో జరిగిన భారత-చైనా యుద్ధం, 1965లో జరిగిన భారత-పాకిస్థాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. 1968 సెప్టెంబర్ లో రా ను ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వేరుచేసి ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. ఇంటెలిజన్స్ బ్యూరో అప్పటికి భారత దేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమాలు పర్యవేక్షించేది.


ఇంటలిజెన్స్ బ్యూరోని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంజీవి పిళ్ళై డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకొన్న తరువాత అనుభవజ్ఞులైన గూఢచారుల కొరత బాగా కనబడింది. 1962 భారత - చైనా,1965 భారత - పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనబడింది. 1966 తరువాత ప్రత్యేక విదేశీ నిఘా సంస్థ ప్రారంభానికి గట్టి చర్యలు తీసుకున్నారు. 1968 లో ఇందిరా గాంధీ హయాంలో ఇటువంటి సంస్థ అవసరం బాగా వచ్చింది. ఆర్.ఎన్. కావ్ అనే వ్యక్తి అప్పటికి ఇంటలిజెన్స్ బ్యూరో డిప్యూటి డైరెక్టర్ గా ఉన్నారు. అతను ఇటువంటి సంస్థకు గల వివరాలతో గల బ్లూప్రింట్ ను ప్రధానికి ఇచ్చాడు. అప్పుడు 'రా' ఏర్పడి, అతనే 'రా' కు చీఫ్ గా నియమితులు అయ్యారు.


రా కు ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను అప్పజెప్పారు. జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ - రా, ఇంటలిజెన్స్ బ్యూరో, రక్షణ ఇంటలిజెన్స్ సంస్థల మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. కానీ జాతీయ రక్షణ సంస్థ ఏర్పాటు తరువాత జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ దానిలో విలీనం అయ్యింది. రా ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ. అది ఏజెన్సీ కాదు ఒక "వింగ్". కేంద్ర కేబినెట్ లో ఒక భాగం. రా పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. సమాచార హక్కు శాసనం నుంచి దానికి మినహాయింపు ఉంది.


ప్రస్తుతం రా గూఢచారులు ప్రతీ పెద్ద ఎంబసీ, హైకమిషన్ లోనూ ఉన్నారు. ఇప్పటికి రాకు సుమారు 10 వేల మంది గూఢచారులు కేవలం పాకిస్తాన్ లోనే ఉన్నారు. రాకు ఆర్క్-వైమానిక (ARC-Aviation Reasearch Centre) నిఘా వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థలో అత్యాధునిక విమానాలను హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.