Gandhi Peace Prize: గాంధీ శాంతి బహుమతి 2021 ని గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్ కు ఇవ్వాలన్న మోదీ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ అవార్డుకు గీతా ప్రెస్ ను ఎంపిక చేయడం అపహాస్యమని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని జ్యూరీ ప్రతిష్టాత్మక అవార్డుకు గీతా ప్రెస్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గీతా ప్రెస్ కు శాంతి బహుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడం సావర్కర్, గాడ్సేలు సన్మానించడంలా ఉంటుందని ట్విట్టర్ వేదికగా జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అక్షయ ముకుల్ అనే రచయిత గీతా ప్రెస్.. హిందూ భారత నిర్మాణం పేరుతో బయోగ్రఫీ రాశారని, ఈ పుస్తకం మహాత్మా గాంధీతో ముకుల్ కు ఉన్న విభేదాల గురించి ప్రస్తావిస్తుంది జైరాం రమేష్ చెప్పారు.
జైరాం రమేష్ ట్వీట్‌పై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత
అయితే జైరాం రమేష్ చేసిన ట్వీట్ పట్ల సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతికి నిరసనగా జైరాం రమేష్ చేసిన ట్వీట్ తో కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏకీభవించడం లేదని తెలుస్తోంది. గీతా ప్రెస్ విషయంలో జైరాం రమేష్ ట్వీట్ అనవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. హిందూ మత ప్రచారంలో గీతా ప్రెస్ పెద్ద పాత్ర పోషించందని.. ఇలాంటి ట్వీట్ చేసే ముందు పార్టీలో అంతర్గతంగా చర్చించి ఉండాల్సిందని అంటున్నారు.
వందేళ్ల చరిత్ర కలిగిన గీతా ప్రెస్
గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ 1923లో స్థాపించారు. గీతా ప్రెస్ ప్రపంచంలోని అతి పెద్ద ప్రచురణకర్తలలో ఒకటి. అహింస, ఇతర గాంధేయ విధానాలతో సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన మార్పు కోసం గీతా ప్రెస్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ సత్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఈ సంస్థ హిందూ ధర్మానికి సంబంధించి పుస్తకాలను ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా వాటిని విక్రయిస్తుంది. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద ప్రచరుణ సంస్థగా కూడా నిలిచింది. 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. ఇందులో 16.2 కోట్ల ముద్రణలు భగవద్గీతకు సంబంధించినవి కావడం గమనార్హం. గీతా ప్రెస్ 1923 లో ఏర్పాటు కాగా, సరిగ్గా శతాబ్ది ఉత్సవాల సమయంలో కేంద్ర ప్రబుత్వం నుంచి ఈ అవార్డు రావడం గమనార్హం.
కోటి రూపాయల బహుమతిని తిరస్కరించిన గీతా ప్రెస్
1995లో గాంధీ శాంతి బహుమతిని తీసుకువచ్చింది కేంద్ర సర్కారు. ఈ బహుమతిని ఏటా ప్రకటిస్తుంది. జాతి, కుల, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా దీనికి అర్హులే. అవార్డు కింద విజేతలకు రూ. కోటి రూపాయలు ఇస్తారు. అయితే 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి అందుకోనున్న గీతా ప్రెస్.. కోటి రూపాయల నగదు బహుమతిని తీసుకోవడానికి మాత్రం నిరాకరించింది. ఈ విషయాన్ని గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లల్మణి తివారీ తెలిపారు.