Costly Tea : టీ, తేనీర్, చాయ్ ఏ పిలుపైన ఒక్కటే. గంటకోసారి ఆ టీ నాలికకు తగలకపోతే అదోలా అయిపోయే జనం చాలా మంది ఉంటారు. అందుకే టీకి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ టీలో ఫ్లేవర్స్ తో ప్రత్యేకంగా స్టార్టప్‌లు కూడా వస్తున్నాయి. ఆ రేట్లు కాస్త ఎక్కువే. అయితే మరీ లక్ష ఉండే టీలు ఉంటాయా అంటే ఉంటాయని చెప్పక తప్పదు.
టీ తోటలకు అస్సాం ప్రసిద్ధి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ సాధారణ రకం టీ తోటలతో పాటు అరుదైన ఆర్గానిక్ టీ తోటలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి 'పభోజన్ గోల్డ్ టీ'. అస్సాంలో లభించే అరుదైన టీ రకాల్లో ఒకటైన 'పభోజన్ గోల్డ్ టీ'కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ తేయాకు ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని నేరుగా అమ్మరు. వేలం పాట పెడతారు. ఇలా కేజీ 'పభోజన్ గోల్డ్ టీ' తేయాకుల్ని వేలంలో పెట్టారు.
గత సోమవారం జోర్హాట్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా కిలో రూ.లక్షకు ఈ టీ అమ్ముడుపోయింది. పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ నుంచి అస్సాంకు చెందిన టీ బ్రాండ్ 'ఎసా టీ' దీన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా చెబుతున్నారు. అస్సాం గోలఘాట్ జిల్లాలో ఈ అరుదైన సేంద్రియ టీ ఉత్పత్తి అవుతుంది. ఈ టీ ప్రత్యేక రుచి, దీని విలువను ఇష్టపడే కొనుగోలుదార్లు అంతర్జాతీయంగా ఉన్నారని సంస్థ పేర్కొంది. ఈ టీ ప్రత్యేక రుచికి రూ.లక్షనిచ్చి ఇష్టపడి కొనుగోలు చేశారంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉంటుంది.
'పభోజన్ గోల్డ్ టీ' మాత్రమే కాదు.. ఇంకా పలు రకాల టీ రకాలను అక్కడ పండిస్తూ ఉంటారు. అవి కూడా ఆర్గానిక్. కేజీ వేలకు వేలు పలికే రకాలు ఉంటాయి. అయితే 'పభోజన్ గోల్డ్ టీ' మాత్రం అత్యధిక రేటు పలికి రికార్డు సృష్టించింది.