Rahul Gandhi Meets Wrestlers: హర్యానా వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ... ఈరోజు (బుధవారం) ఉదయం రెజ్లర్లను కలిసి వారికి సంఘీభావం ప్రకటించారు.  ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాతో పాటు దేశంలోని ప్రముఖ రెజర్లతో సమావేశమయ్యారు. అంతేకాదు.. సరదాగా కాసేపు రెజ్లింగ్‌ కూడా చేశారు రాహుల్‌  గాంధీ.


మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు, భారత రెజ్లింగ్ సమాఖ్య చుట్టూ వివాదాలు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) WFI  ఎన్నికల ఫలితాలపై  పలువురు రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. క్రమంలో రాహుల్‌ గాంధీ వారిని కలిసి... వారి పోరాటానికి మద్దతు తెలపడం  ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఝజ్జర్ జిల్లాలోని ఛరా గ్రామంలో వీరేందర్ అఖాడాను సందర్శించారు. అక్కడే రెజ్లర్లతో సమావేశమయ్యారు. రెజ్లర్ల రోజువారీ  కార్యక్రమాలను పరిశీలించారు. బజరంగ్‌ పునియాతో కాసేపు... రెజ్లింగ్‌ కూడా చేశారు రాహుల్‌ గాంధీ. దీనికి సంబంధించిన ఫొటోలను... తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి..  రెజ్లర్ల పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు రాహుల్‌ గాంధీ. అలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


రెజర్లు ఏళ్ల తరబడి కష్టపడి.. ఓర్పుతో, అసమానమైన క్రమశిక్షణతో... రక్తం, చెమట చిందించి మన దేశానికి పతకాలు తెస్తున్నారని అన్నారు రాహుల్‌ గాంధీ. అయితే.. ఈ  ఆటగాళ్ళు, దేశ బిడ్డలు... వారి రంగంలో పోరాటాన్ని విడిచిపెట్టి... హక్కులు, న్యాయం కోసం వీధుల్లో పోరాటం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే  కొనసాగితే... వారి పిల్లలను ఈ మార్గాన్ని ఎంచుకోమని ఎవరు ప్రోత్సహిస్తారు అని ప్రశ్నించారు రాహుల్‌ గాంధీ. రైతు కుటుంబాలకు చెందిన అమాయక, సాధారణ వ్యక్తులైన  ఈ క్రీడాకారులను త్రివర్ణ పతాకానికి సేవ చేయనివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు. పూర్తి గౌరవంతో భారతదేశాన్ని గర్వించేలా చేయండి అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు రాహుల్‌  గాంధీ.


బీజేపీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సహాయకుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం... వివాదానికి ఆజ్యం పోయిసింది. మహిళా  రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో... బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్‌ ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చినా... బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సహాయకుడు సంజయ్ సింగ్  డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై నిరసన వ్యక్తమైంది. రెజర్లు బజరంగ్ పూనియా, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత వినేష్ ఫోగట్, ఒలింపిక్ కాంస్య పతక విజేత  సాక్షి మాలిక్... నిరసనకు దిగారు. తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించారు. సమస్య తీవ్రం అమవుతుందని భావించిన కేంద్ర క్రీడల శాఖ చర్యలు చేపట్టింది. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన కార్యవర్గాన్ని రద్దు చేసింది.  డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో 47 ఓట్లకు 40 ఓట్లు గెలుచుకుని సంజయ్ సంచలన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఆయన ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌ గోండాలోని నందిని నగర్‌లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా అభివర్ణించిన క్రీడల శాఖ.. రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన డబ్ల్యూఎఫ్ (WFI) ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉందని... స్పోర్ట్స్ కోడ్‌ను ఉల్లంఘించినట్టు కనిపిస్తోందంటూ ప్రకటనలో తెలిపింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.