Rahul Gandhi Bungalow Row :రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దైన వేళ నెల రోజుల్లోగా బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్త చేశారు. రాహుల్ గాంధీ కోరుకుంటే తన ఇంటికి రావాలని, ఆయన కోసం తన బంగ్లాను ఖాళీ చేస్తానని ప్రకటించారు. 


రాహుల్ గాంధీ బంగ్లాను ఖాళీ చేస్తే ఆయన తన తల్లితో కలిసి ఉంటారని, లేదంటే తనతో కలిసి ఉండొచ్చని, ఆయన కోసం బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పారు ఖర్గే.


రాహుల్‌ను బెదిరించడం, అవమానించడం వంటి వైఖరిని ఖండిస్తున్నామన్నారు ఖర్గే. ఈ పద్ధతి మంచిది కాదన్నారు. "కొన్నిసార్లు మేము 3-4 నెలలు బంగ్లా లేకుండా ఉంటున్నాం. 6 నెలల తర్వాత నాకు బంగ్లా దొరికింది. వీళ్లు తమ వారిని కించపరిచేందుకే ఇలా చేస్తున్నారు. అటువంటి వైఖరిని నేను ఖండిస్తున్నాను.


గత వారం రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడిన తర్వాత లోక్ సభ గృహనిర్మాణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 12 తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ సెక్రటేరియట్ కాంగ్రెస్ నేత రాహుల్‌కు లేఖ రాసింది.






అనర్హత వేటు పడిన సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోయిన నెల రోజుల్లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గడువు పొడిగించాలని హౌసింగ్ కమిటీని రాహుల్ గాంధీ కోరే అవకాశం ఉందని మరో అధికారి తెలిపారు.