Rahul Gandhi: 'కాంగ్రెస్ రహిత' భారతదేశాన్ని స్థాపించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నాస్త్రాలు సంధించారు. శుక్రవారం(సెప్టెంబర్ 1) ముంబయిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బీజేపీ, మోదీ చేస్తున్న ప్రయత్నాలపై సెటైర్లు వేశారు. ప్రధాని రాజకీయ అజెండాపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రభావాంపైనా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 


ప్రతిపక్ష కూటమి I.N.D.I.A(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్) మూడో సమావేశం తర్వాత రాహుల్ గాంధీ.. లడఖ్ కు సంబంధించిన క్లిష్టమైన అంశాలపై, సరిహద్దు వివాదాలపై ప్రభుత్వ ప్రతిస్పందనను, ప్రతిపక్ష కూటమి అవినీతి వ్యతిరేక అజెండాను ప్రస్తావించారు. 






బీజేపీని ఓడించగల సామర్థ్యం ప్రతిపక్ష కూటమికి ఉందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి నేతల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరిచే ప్రాముఖ్యతను రాహుల్ నొక్కి చెప్పారు. ఇటీవల జరిగిన  సమావేశాలతో నాయకుల మధ్య సత్సంబంధాలు, ఐక్యంగా ముందుకు సాగడంలో గణనీయమైన పురోగతిని సాధించడానికి ఉపయోగపడ్డాయని తెలిపారు. 






I.N.D.I.A కూటమి సమావేశంలో తీసుకున్న రెండు ముఖ్యమైన చర్యల గురించి రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కోఆర్డినేషన్ కమిటీని దాని పరిధిలో ఇతర కమిటీలను ఏర్పాటు చేయాలని కూటమి సమావేశంలో తీసుకున్న ఒక కీలక నిర్ణయమని తెలిపారు. సీట్ల భాగస్వామ్య చర్చలు, నిర్ణయాలను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలనే నిబద్ధత కనబర్చడం రెండోదిగా పేర్కొన్నారు. దేశంలో గణనీయమైన జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల మధ్య ఐక్యతను రాహుల్ మరోసారి కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో I.N.D.I.A కూటమి బీజేపీకి అసలు సిసలైన సవాల్ విసురుతుందని అన్నారు.






రాహుల్ గాంధీ ఇటీవల లడఖ్ పర్యటన చేసిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లినప్పుడు క్షేత్రస్థాయి సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింత బాగా తెలుసుకున్నట్లు చెప్పారు. ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ అలుముకున్న వాతావరణం గురించి తెలిసొచ్చిందన్నారు. ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా భారత భూభాగంలోకి చైనా చొరబాట్ల లడఖ్ ప్రజలు తనకు చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం లడఖ్ ప్రజలను మోసం చేస్తోందని ఆ విషయం అక్కడి స్థానికులు కూడా బాగా తెలుసని అన్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితుల గణనీయంగా మారాయని తెలిపారు. చైనాతో వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని రాహుల్ ఆరోపించారు.