పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూపై విపరీత స్థాయిలో ఆరోపణలు చేశారు. వీరిద్దరి మధ్యా నెలకొన్న విభేదాల కారణంగా అమరీందర్ సింగ్ పదవి నుంచి వైదొలిగారని అంటున్నారు. అయితే, సీఎం పదవి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్దూకే వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో అమరీందర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


నవజ్యోత్ సింగ్ సిద్దూకు సీఎం పదవి ఇవ్వడాన్ని అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. దేశ భద్రత, ఇతర ప్రయోజనాల కోసం అతనికి పదవి ఇవ్వొద్దని కోరారు. నవజ్యోత్ సింగ్ సిద్దూకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం పదవికి సరైన వ్యక్తి కాదని, ఆయన ఎంపిక దేశానికే ప్రమాదమని అన్నారు. తన ప్రభుత్వంలోనే పూర్తి విఫలమైన వ్యక్తి అని అన్నారు. తాను ఇచ్చిన ఒక్క మంత్రివర్గ శాఖను కూడా సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పారు. ఏడు నెలలుగా ఆయన ఒక్క ఫైల్‌ని కూడా ముందుకు కదపలేదని అన్నారు. 


కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. తాను సమాధానం ఇవ్వబోనని తేల్చి చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నట్లుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పినట్లుగా వివరించారు. ఈ ఉదయమే ఆమె తనకు సారీ చెప్పినట్లు అమరీందర్ వెల్లడించారు.