కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (CAPF) మానసిక రోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020లో 3,584 ఉండగా 2022 నాటికి 4,940కి పెరిగింది. రెండేళ్లలో దాదాపు 38 శాతం పెరిగిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభకు తెలియజేసింది. CAPF పరిధిలో సరిహద్దు భద్రతా దళం (BSF), సశాస్త్ర సీమా బల్ (SSB), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP), అస్సాం రైఫిల్స్ (AR), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉంటాయి. వైద్య సంస్థలతో అనుసంధానమై మానసిక వైద్యులు, క్లినికల్ సైకాలజిస్టులు, కౌన్సెలర్‌ల సేవలను అందిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. ITBPలో ఐదుగురు, BSFలో నలుగురు, CRPFలో ముగ్గురు, SSB, ARలలో ఒక్కొక్కరు చొప్పున మానసిక వైద్యులు ఉన్నారని రాయ్ చెప్పారు.
మంత్రి వివరాల మేరకు.. 2021లో CAPFలలో 3,864 కేసులు నమోదయ్యాయి. CRPFలో 2020లో మొత్తం 1,470 మంది మానసిక రోగులు, 2021లో 1,506 మంది, 2022లో 1,882 మంది ఉన్నారు. BSFలో 2020లో 1,073 మంది, 2021లో 1,159 మంది, 2022లో 1,327 మంది మానసిక రోగులు ఉన్నారు. అస్సాం రైఫిల్స్‌లో 2020లో 351 మంది, 2021లో 509 మంది మరియు 2022లో 530 మంది రోగులు ఉన్నారు. CISFలో 2020లో 289 మంది, 2021లో 244 మంది, 2022లో 472 మంది, ITBPలో 2020లో 215 మంది, 2021లో 300 మంది, 2022లో 417 మంది ఉద్యోగులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. SSBలో 2020లో 186 మంది, 2021లో 246 మంది, 2022లో 312 మంది రోగులు ఉన్నట్లు మంత్రి తెలిపారు.
2018 నుంచి 2022 వరకు 658 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని , CRPFలో 230 మంది, BSFలో 174 మంది, CISFలో 91 మంది, SSBలో 65 మంది, ITBPలో 51 మంది, ARలో 47 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఈ పరిస్థితులను మార్చేందుకు అన్ని CAPFల్లో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రాయ్ తెలిపారు. మానసిక రోగులుగా గుర్తించిన వెంటనే వారికి సరైన చికిత్స అందిస్తున్నామని, అవసరమైతే, మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రుల్లని నిపుణులకు రెఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తామని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం రికార్డులు నమోదు చేస్తామని వాటిపై సమీక్ష ఉంటుందన్నారు.
ఉద్యోగుల ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి శారీరక శిక్షణలో యోగా చేర్చినట్లు వెల్లడించారు. యూనిట్ స్థాయిలో కేసులను గుర్తించి, ముందస్తు చికిత్స అందించడానికి పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. బోర్డర్ అవుట్ పోస్ట్స్ (BOPs) వద్ద సిబ్బంది ఒత్తిడి తగ్గించడానికి అన్ని స్థాయిల్లో కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పని పరిస్థితులను మెరుగుపరిచే చర్యల గురించి రాయ్ మాట్లాడారు. CAPFలో సిబ్బంది బదిలీ, సెలవులను పారదర్శకంగా అందిస్తున్నామని, సాధ్యమైనంత వరకు సిబ్బంది ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. సైనికులకు జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి వినోదం, క్రీడలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత, స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్న సిబ్బంది సంఖ్య భారీగా పెరిగిందని. CAPFలో 2018లో 9,228 మంది సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ పొందగా, 2019లో 8,908 మంది సిబ్బంది, 2020లో 6,891 మంది సిబ్బంది, 2021లో 10,762 మంది, 2022లో 11,211 మంది సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ పొందారని రాయ్ ఆగస్టు 1న లోక్‌సభలో తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, CAPF, ఢిల్లీ పోలీస్ వంటి సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్‌తో సహా దాని సంస్థల్లో 1.14 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజ్యసభకు తెలిపారు.