ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖ వారికి బిగ్ షాక్ ఇచ్చింది. పోలీస్ అలవెన్స్ లో కోత పెడుతున్నట్లు జీవో నెం. 79 ను విడుదల చేసింది. కొద్ది కాలం క్రితం వైసీపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇంతకు ముందు ఇచ్చిన 30శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే స్క్వాడ్ సిబ్బందికి 15 శాతం అలవెన్స్ ను కూడా తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ తొలగించింది. ఏసీబీలోకి డైరెక్టుగా వచ్చిన వారి అలవెన్స్ లను కూడా 10 నుంచి 8 శాతానికి కుదించింది. డిప్యూటేషన్ పై ఏసీబీలో వర్క్ చేస్తున్న వారి అలవెన్స్ కూడా 30 నుంచి 25 శాతానికి కోత పెట్టింది. గత నెలలోనే అలవెన్స్ లో కోత విధిస్తూ ఏపీ గవర్నమెంట్ జీవో నెం.79 ని ప్రవేశపెట్టింది.
ఈ జీవో మాకు సమ్మతమే అని ఏపీ గవర్నమెంట్ కి డీజీపీ ఆఫీస్ ఆమోదం తెలిపింది. దీంతో పోలీసు వారి అలవెన్స్ ల్లో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. కానిస్టేబుల్ కు చాలా సంవత్సరాల నుంచి సైకిల్ అలవెన్స్ ను ప్రభుత్వం అందిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు కూడా సైకిల్ వాడటం లేదని రూ.300 సైకిల్ అలవెన్స్ కట్ చేసేసింది.
సైకిల్ వాడక పోయినప్పటికీ డ్యూటీకి రావడానికి కచ్చితంగా వాహనం కావాలి కాబట్టి కనీసం దానికైనా అలవెన్స్ ఇవ్వాలని కొందరు పోలీసులు పైకి చెప్పలేక అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ నక్సల్ స్క్వాడ్ ను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది.
ఈ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే పోలీసులకు 15 శాతం రిస్క్ అలవెన్సును గతంలో ఇచ్చారు. తాజాగా ఈ రిస్క్ అలవెన్స్‌ను కట్ చేసింది ప్రభుత్వం. దీంతో ఏఎన్‌ఎస్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎస్‌ఐకి పది నుంచి పన్నెండు వేల వరకూ జీతం తగ్గిపోగా, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.8 వేలు, కానిస్టేబుళ్లకు రూ.6 నుంచి 8 వేల వరకూ అలవెన్స్ లు తగ్గిపోయాయని వాపోతున్నారు.