నూతన పార్లమెంటు భవనం ప్రారంభమైంది. ఎంపీలు మంగళవారం పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాల్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నడుచుకుంటూ కొత్త భవనానికి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి మోదీ చేసిన ఉద్విగ్న భరిత ప్రసంగం అనంతరం ఎంపీలందరూ ఉత్సాహంగా నూతన భవనం వైపు అడుగులు వేశారు. ముందు ప్రధాని నడుస్తుండగా.. ఎంపీలు, మంత్రులు భారత్‌ మాతా కీ జై, వందే మాతరం అని నినాదాలు చేస్తూ ఆయన అనుసరించి వెళ్లారు. ఎంపీల నినాదాలతో కొత్త పార్లమెంటు భవనం ప్రాగణమంతా కోలాహలంగా మారింది. సెంట్రల్‌ హాల్‌లో ఉండే రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నూతన పార్లమెంటుకు తరలించారు. 


నూతన పార్లమెంటులో ప్రారంభమైన కార్యకలాపాలు


కొత్త భవనంలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. తర్వాత సభ్యులందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంటు కార్యకలాపాలను ప్రారంభించారు. తొలుత స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మకమైన రోజును చూస్తున్నందుకు మనమంతా అదృష్టవంతులమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.


ప్రధాని మోదీ ప్రసంగం..


స్పీకర్‌ మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ నూతన భవనంలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయం లాంటిదని అన్నారు. భారతదేశ నూతన భవిష్యత్తుకు నిదర్శనమని తెలిపారు. వినాయకచవితి రోజున కొత్త భవనం ప్రారంభించడం శుభ సూచకమని పేర్కొన్నారు.
అన్ని పార్టీలు గత వైరాన్ని మర్చిపోవాలని మోదీ ఎంపీలకు విజ్ఙప్తి చేశారు. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అందరం నిరంతరం కృషి చేయాలని మోదీ పేర్కొన్నారు.


చంద్రయాన్‌ 3  విజయవంతమవడం దేశంలోని ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని అన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడం, విజయవంతంగా సదస్సును నిర్వహించడం పట్ల భారత్‌కు ఎంతో గౌరవం దక్కిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశ ప్రభావం పెరిగిందని, గొప్ప విజయాలు భారత్‌ సాధించగలదని నిరూపించామని పేర్కొన్నారు. ఆధునిక భారతీయతత్వం, ప్రాచీన ప్రజాస్వామ్యాల కలబోతకు చిహ్నంగా ఈరోజు కొత్త పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అన్నారు.


'దేశానికి సేవ చేయడానికి పార్లమెంటు అత్యున్నత ప్రదేశం. ఈ కొత్త భవనంలో మనం ఏం చేసినా దేశంలోని పౌరులందరికీ అది స్ఫూర్తివంతంగా ఉండాలి. మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు గత చేదు అనుభవాల్ని మర్చిపోవాలి. ఈ భవనం కొత్తది. ఇక్కడ ప్రతీదీ కొత్తది. కానీ ఇక్కడ మన వారసత్వపు చిహ్నం ఉంది. అదే నిన్నటిని, నేటిని కలుపుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొత్త ప్రారంభానికి మొదటి సాక్షి, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే పవిత్రమైన సెంగోల్‌  ఇది. భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ తాకి సెంగోల్‌ ఇది.' అని మోదీ మాట్లాడారు.