PM Modi Letter: దేశంలో హోరా హోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల(General Elections) ప్రచార ఘట్టం గురువారం ముగిసింది. అప్పటి వరకు నిరిరామంగా 62 రోజుల పాటు(మార్చి 16 నుంచి) ఎన్డీయే(NDA) అభ్యర్థుల పక్షాన దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాన మంత్రి(Prime minister) నరేంద్రమోదీ(Narendra modi).. ప్రచారం ముగియగానే.. తమిళనాడు(Tamilnadu)లోని కన్యాకుమారి(Kanniyakumari)కి చేరుకున్నారు. ఇక్కడి సముద్రం మధ్యలో ఉన్న స్వామి వివేకా నంద స్మారక మందిరంలో కఠిన ధ్యానం చేశారు. కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకుని 45 గంటల పాటు సూర్యనమస్కారాలు.. ధ్యానం పూర్తి చేశారు. అనంతరం.. ఆయన తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. ప్రయాణ సమయంలో దేశప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. దీనిలో ప్రధానంగా ఆయన భవిష్యత్ సంకల్పాను ఆవిష్కరించారు. కన్యాకుమారి ధ్యానంతో కొత్త సంకల్పాలు సృజించాయని తెలిపారు. ప్రధాని లేఖ(Letter) యథాతథంగా..
అతి పెద్ద పండుగ
ప్రజాస్వామ్యానికి తల్లి వంటి దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ అయిన.. 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. కన్యాకుమారిలో సాగిన మూడు రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం అనంతరం.. తిరిగి ఢిల్లీకి పయనమయ్యాను.. చివరి రోజు.. కాశీ సహా అనేక కీలక నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న విషయం మనసులో మెదిలింది. నా మనసులో అనే భావాలు.. అనుభవాలు కదలాడాయి. అమృత కాలంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. నా తొలి ప్రచారం కొన్ని నెలల కిందట మీరట్ నుంచి ప్రారంభమైంది. స్వాతంత్రం కోసం 1857లో తొలి పోరాటం జరిగిన భూమి ఇదే. అప్పటి నుంచి(ప్రచారం ప్రారంభించిన) దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించాను. చివరి ప్రచారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ముగిసింది. ఇది.. సంత్ రవిదాస్ నడయాడిన పుణ్య భూమి. అనంతరం.. నేను కన్యాకుమారికి చేరుకున్నాను. అమ్మ భారతి పాదపద్మాల చెంతకు చేరాను.
సహజంగానే ఎన్నికల సమయం కావడంతో నా మనసు, గుండెలనిండా ఎన్నికల భావనే కదలాడింది. నేను చేసిన ప్రచార ర్యాల్లీల్లో అనేక మందిని చూశాను. నా కళ్లలో ఇంకా వారు గుర్తున్నారు. ముఖ్యంగా నారీ శక్తి ఆశీస్సులు, వారి వాత్సల్యం వంటివి నా జీవితంలో తొలి అనుభవం. నా కనులు ధ్యానంలోకి వెళ్లాయి. అప్పటి వరకు సాగిన ప్రచారం.. విమర్శలు.. సవాళ్లు.. మాటల యుద్ధాలు ఇలా.. అనేకానేకం నుంచి బయట పడేందుకు ధ్యానాన్ని ఆశ్రయించాను. బాహ్య ప్రపంచానికి ఈ ధ్యానం నన్ను దూరం చేసింది.
అయితే.. అనేక బాధ్యతలు ఉన్నప్పుడు.. ఇలా ధ్యానం చేయడం అనేది సవాళ్లతో కూడుకున్న పని. కానీ, కన్యాకుమారి వంటి పవిత్ర ప్రాంతం, స్వామి వివేకానందుడు నాకు ఆ శక్తిని ప్రసాదించారు. నిజానికి వారణాసి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా నేను నా ప్రచారాన్ని నా చేతుల నుంచి కాశీ ప్రజలకు వదిలి పెట్టి ఇక్కడకు చేరుకున్నాను. ఇలాంటి విలువలు.. పుట్టుకతోనే నాకు ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. స్వామి వివేకానంద తన జీవితంలో కన్యాకుమారిలో ధ్యానం చేసిన రోజులను స్మరించుకున్నాను. ధ్యానంలో భాగంగా ఇలాంటిఆలోచనలతోనే గడిపాను.
శాంతి, మౌనంతో కూడిన ధ్యానం మధ్య భారత దేశ ఉజ్వల భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచించాను. ఇది భారత దేశ లక్ష్యం. కన్యాకుమారిలో ఉదయిస్తున్న సూర్యభగవానుడిని వీక్షించినప్పుడు.. నాలో మరిన్ని ఆలోచనలు పెల్లుబికాయి. ఎగిసి పడుతున్న అలలు.. నా ఆలోచనలను మరింతగా విస్తరించేలా చేశాయి. ఐక్యత, సమైక్యత దిశగా ప్రపంచ లోతులు తెలుసుకునేలా చేశాయి. గతంలో హిమాలయాలలో చేసిన ధ్యానం మరోసారి స్ఫురణకు వచ్చింది.
మిత్రులారా..
కన్యాకుమారి ప్రాంతం ఎల్లవేళలా నా మనసుకు హత్తుకునే ఉంది. ఏక్‌నాథ్ రనాడే జీ నేతృత్వంలో ఇక్కడ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం జరిగింది. ఏక్‌నాత్ రనాడే తో కలిసి ప్రయాణించే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇక్కడకు వచ్చిన పరిశీలించే అవకాశం లభించింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఇదొక కామన్ గుర్తింపుగా దేశంలోని ప్రతి పౌరుడి మదిలోనూ గుర్తుండి పోతుంది. ఇది ఒక శక్తి పీఠం. కన్యాకుమారి అమ్మ శక్తి ఇక్కడ నిక్షిప్తమైంది. దక్షిణ భాగంలో శక్తి మాత పర్యటించి.. భగవాన్ శివుడి కోసం వేచి చూసిన ప్రాంతం ఇదే. అంతేకాదు.. కన్యాకుమారి ఒక సంగమ స్థలం. అనేక నదులు వచ్చి.. ఇక్కడి సముద్రంలో కలుస్తాయి. కేవలం నదులు మాత్రమే కాదు.. ఇక్కడ సైద్ధాంతిక భావనలు కూడా.. సంగమిస్తాయి.
ఇక్కడ, వివేకానందరాక్ మెమోరియల్‌తోపాటు.. తిరువళ్లువర్ విగ్రహం, గాంధీ మండపం, కామరాజర్ మణి మండపం వంటి గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి. అందుకే ఇది సైద్ధాంతిక సంగమం. జాతీయ దృక్ఫథా న్ని పెంచి పోషించిన మహనీయులు వీరంతా! వీరంతా జాతి నిర్మాణం కోసం స్ఫూర్తి మంతులుగా నిలి చారు. దేశ ఐక్యతకు కన్యాకుమారి ప్రాంతం గొప్ప సందేశం ఇస్తోంది. ముఖ్యంగాభారత దేశ ఐక్యత, జాతీయవాదంపై సందేహాలు ఉన్నవారికి ఈ ప్రాంతం గొప్ప సందేశం.
తమిళ భాషను సుసంపన్నం చేయడంలో తిరువళ్లువర్ మకుటాయమానంగా నిలిచారు. తిరువళ్లువర్ బోధనలు.. ప్రతి ఒక్కరి జీవితంలోనే కాకుండా.. దేశానికి సంబంధించి కూడా గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇటువంటి గొప్పవారికి నివాళులర్పించే సందర్భం రావడం నిజంగా నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నా.
భారత దేశ అనంతమైన, శాశ్వతమైన శక్తిపై నా విశ్వాసం, భక్తి ప్రకటితమయ్యాయి. ఈ విశ్వాసం రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో దేశ సామర్ధ్యం మరింత పెరగడాన్ని నేను చూశా. దానిని ప్రత్యక్షంగా అనుభవించా. 20వ శతాబ్దపు 4, 5వ దశాబ్దాలను మనం స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త పంథాను అందించడానికి ఉపయోగించుకున్నట్లే, 21వ శతాబ్దంలోని ఈ 25 సంవత్సరాల్లో మనం `వికసిత భారత్'కు పునాది వేయాలి. స్వాతంత్య్ర పోరాటం గొప్ప త్యాగాలకు పిలుపునిచ్చిన కాలమిది. ప్రస్తుత కాలం ప్రతి ఒక్కరి నుంచి స్థిరమైన సహకారాన్ని కోరుతోంది.
రాబోయే 50 ఏళ్లు మనం దేశం కోసమే అంకితం కావాలని 1897లో స్వామి వివేకానంద పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకుని సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత... 1947లో దేశం దాశ్య శృంఖలాలు తెంచుకుంది.
నేడు మనకు అదే సువర్ణావకాశం వచ్చింది. రాబోయే 25 ఏళ్లు దేశం కోసమే అంకితమవుదాం. మన ప్రయత్నాలు రాబోయే తరాలకు, రాబోయే శతాబ్దాలకు బలమైన పునాదిని వేస్తాయి, దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళతాయి. దేశ శక్తి, ఉత్సాహాన్ని చూస్తుంటే లక్ష్యం ఇప్పుడు ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు. మరింత వేగవంతమైన అడుగులు వేద్దాం. అందరం కలిసి `వికసిత భారత్` కలను సాకారం చేసుకుందాం.