Modi Spoke To Putin: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (ఆగస్టు 8, 2025) నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీతో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు.
పీఐబీ అధికారిక ప్రకటన ప్రకారం, అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీకి ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను తెలియజేశారు. అనంతరం, ప్రధాని మోదీ పుతిన్‌కు చేసిన వివరణాత్మక అంచనాకు ధన్యవాదాలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ పోరాటానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశ స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించారు.
మోదీ -పుతిన్ భారతదేశం-రష్యా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నారు
అదే సమయంలో, ఇరువురు నాయకులు భారతదేశం-రష్యా సంబంధాలు, ద్వైపాక్షిక ఎజెండాలో సాధించిన పురోగతిని సమీక్షించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్‌ను భారతదేశానికి ఆహ్వానించారు
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఈ సంవత్సరం చివరిలో జరగనున్న భారతదేశం-రష్యా వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించారు. రష్యా అధ్యక్షుడు భారతదేశ పర్యటన పూర్తైన తర్వాత, రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంచడానికి ఒక కొత్త వేగాన్ని అందించే అవకాశం ఉంది.
ట్రంప్ రెట్టింపు సుంకాల ప్రకటన మధ్య మోదీ-పుతిన్ చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (ఆగస్టు 6, 2025) నాడు భారతదేశంపై 50 శాతం రెట్టింపు సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఈ టైంలోనే ప్రధాని నరేంద్ర మోదీ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని కొనసాగించడం, తక్కువ ధరలకు ముడి చమురును దిగుమతి చేసుకోవడంపై భారతదేశంపై 50 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.
అయితే, గత వారంలో ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు, కాని రెండు రోజుల క్రితం బుధవారం (ఆగస్టు 6) నాడు ట్రంప్ ఈ అమెరికా రెసిప్రోకల్ సుంకాన్ని రెట్టింపు చేస్తూ భారతదేశంపై మరో 25 సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.