ఉచిత పథకాలపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెటైర్లు వేశారు. స్వార్థం కోసం కొన్ని పార్టీలు ఉచితాల పాట పాడుతున్నాయని మండిపడ్డారు.
హర్యానాలోని పానిపట్‌లో ఏర్పాటు చేసిన 2జీ ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉచిత హామీలు ఇస్తున్న పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఉచిత హామీలతో మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు ప్రధాని. భవిష్యత్‌లో ఉచితంగా పెట్రోలు, డీజిల్ ఇస్తామని కూడా హామీ ఇస్తాయని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు నరేంద్రమోదీ.
ఉచిత హామీలు పిల్లల భవిష్యత్‌ను హరిస్తాయని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశం ఆత్మనిర్బర్ కాకుండా అడ్డుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నులు చెల్లించేవాళ్లకు ఇదో పెద్ద దెబ్బ అని తెలియజేశారు. ఎన్నికల్లో ఉచితర వాగ్దానాలతో ఓట్లు రాబట్టుకోవడం అభివృద్ధికి ఆంటంకమని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా ఉచిత హామీల నియంత్రణకు సుప్రీంకోర్టు ప్రయత్నాలు చేస్తున్న టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి. ఉచిత హామీలతో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎప్పటి నుంచో బీజేపీ ఆరోపిస్తోంది. ఇదే ఫార్ములాతో గుజరాత్‌లో కూడా ప్రచారం స్టార్ట్ చేసింది ఆప్. అందుకే ముందస్తుగా ఇలాంటి హామీలు నమ్మొద్దని బీజేపీ ప్రతి వ్యూహాన్ని రెడీ చేస్తోంది. ఈ పరిస్థితిలో ప్రధాని మోదీ కామెంట్స్ కీలకంగా మారాయి.
కాంగ్రెస్‌పై మోదీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరాశలో కూరుకుపోయిన పార్టీలు చేతబడితో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ నెల 5న నల్లని దుస్తుల్లో కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని తప్పుపట్టారు మోదీ. వాళ్లు ఎన్ని మాయమాటలు చెప్పినా... మ్యాజిక్ చేయాలని భావించినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు వంటి ప్రజా సమస్యలపై ఆగస్టు ఐదున కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అగ్రనేతలు, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక ఇలా అంతా ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. నల్లని దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ ఆందోళనలపైనే ప్రధానమంత్రి మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.