పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. కనీసం వాష్ రూమ్ లేకుండా ఏర్పాట్లు చేసి తనను అవమానించారని, ప్రొటోకాల్ పాటించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. వేదిక ఎంపికను ప్రశ్నించడంతో పాటు  సంతాల్ కమ్యూనిటీ తమ సంస్కృతిని జరుపుకోవడానికి ఉద్దేశించిన సదస్సుకు ఆ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది హాజరు కాలేకపోవడం తనను బాధించిందని అన్నారు. ముర్ము చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అగ్గి రాజేశాయి. 

వేదిక మార్పుపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలుఈ సదస్సు వేదికను డార్జిలింగ్ జిల్లాలోని బిధానగర్ నుండి సిలిగురి శివార్లలోని బాగ్డోగ్రా ప్రాంతంలోని గోషాయ్‌పూర్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మార్చడంతో ఈ వివాదం మొదలైంది. మమత సర్కార్ నిర్ణయం వల్ల సంతాల్ కమ్యూనిటీకి చెందిన చాలా మంది తమ కార్యక్రమానికి చేరుకోలేకపోయారని ముర్ము పేర్కొన్నారు. రద్దీ సాకుగా చూపి, వేదిక మార్చితే బహుశా ఎవరూ పాల్గొనలేరని, ఇక్కడికి వచ్చినా రాష్ట్రపతి తిరిగి వెళ్లిపోతారని ప్రభుత్వం భావించి ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ రాష్ట్రానికి వచ్చినా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పెద్దలు ఆమెకు స్వాగతం పలకడానికి వెళ్లకపోవడం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రధాని మోదీ సహా ఎన్డీయే, వారి మిత్రపక్షాలు ప్రశ్నించాయి.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మంత్రులు స్వాగతం పలకడానికి రాకపోవడాన్ని ముర్ము ప్రస్తావించడంతో విషయం మరింత పెద్దదైంది.  ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి అధికారికంగా ఒక రాష్ట్రానికి పర్యటించినప్పుడు సీఎం లేదా కనీసం ఒక సీనియర్ మంత్రి హాజరై స్వాగతం పలకాలని.. కానీ స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వచ్చిన ఏకైక నేత సిలిగురి మేయర్ గౌతమ్ దేబ్ మాత్రమే అని ముర్ము తెలిపారు. తాను బెంగాల్ బిడ్డగా భావిస్తానని, సీఎం మమతను సోదరిగా భావిస్తాను.. కానీ ఆమె తనపై ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

సంతాల్ కమ్యూనిటీకి అందుబాటులో లేకపోవడంపై ముర్ము ఆగ్రహంభారీ జనసందోహానికి వీలయ్యేలా ఇక్కడే కార్యక్రమాన్ని సులభంగా నిర్వహించి ఉండవచ్చని, అలా చేయకపోవడంతో సంతాల్ కమ్యూనిటీకి చెందిన చాలా మంది కార్యక్రమానికి హాజరుకాలేదని ముర్ము అన్నారు. 5 లక్షల మంది సులభంగా హాజరయ్యే చోట నుంచి బాగ్డోగ్రా ప్రాంతంలోని గోషాయ్‌పూర్‌కు తరలించడం సరికాదన్నారు. సదస్సుకు హాజరు కావాలని ఆశించిన వారికి వేదిక మార్పు, వేదిక ఉన్న ప్రదేశం కారణంగా రాలేకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ (West Bengal) ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రపతి ముర్మును అవమానించడం సరికాదన్నారు. రాష్ట్రపతిని అవమానించడం అంటే దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని కించపరచడమేనని మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జరిగిన ఈ అవమానాన్ని దేశం, నారీ శక్తి ఎప్పటికీ క్షమించవని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణల్ని తోసిపుచ్చిన మమతా బెనర్జీరాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో బహిరంగంగా చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని పేర్కొన్నారు.  ‘సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతాల్ సదస్సుకు రాష్ట్రపతిని "అంతర్జాతీయ సంతాల్ కౌన్సిల్" అనే ఒక ప్రైవేట్ సంస్థ ఆహ్వానించింది. అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ASL) తర్వాత నిర్వాహకులు సరైన ఏర్పాట్లు పూర్తిచేయలేదని జిల్లా అధికారులు రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు లిఖితపూర్వకంగా  తెలియజేశారు.  ఫోన్ ద్వారా కూడా వివరించారు. (వాటి వివరాల కోసం  నా ఫేస్‌బుక్ పోస్ట్‌ను చూడండి).

రాష్ట్రపతి సెక్రటేరియట్ అడ్వాన్స్ టీమ్ 05.03.26న సందర్శించి ఏర్పాట్లలో లోపం గురించి తెలుసుకున్నప్పటికీ, కార్యక్రమం షెడ్యూల్ ప్రకారమే జరిగింది. రాష్ట్రపతి కార్యాలయం  పంచుకున్న ఆమోదిత లైనప్ ప్రకారం సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్ (DM), సిలిగురి పోలీస్ కమిషనరేట్ సీపీ (CP) రాష్ట్రపతికి స్వాగతంతో పాటు చివర్లో వీడ్కోలు పలికారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (CM) ఆ లైనప్‌లో లేదా డయాస్ (వేదిక) ప్లాన్‌లో భాగం కాదు. జిల్లా అధికారుల నుంచి ఎటువంటి ప్రోటోకాల్ లోపం తలెత్తలేదు. కానీ బీజేపీ తన సొంత పార్టీ ఎజెండా కోసం దేశంలోని అత్యున్నత పదవిని అగౌరవపరుస్తూ, దుష్ప్రచారంతో దుర్వినియోగం చేస్తోంది. ఇది అత్యంత దురదృష్టకరం’ అని మమతా బెనర్జీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

ప్రొటోకాల్ వివాదంపై బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం లేఖరాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రొటోకాల్‌ పాటించలేదంటూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముర్ము పర్యటనలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని మమత ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు బెంగాల్ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ఓ లేఖ రాశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, లేక మంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు హాజరు కాలేదు? అని.. రాష్ట్రపతి ముర్ము కోసం ఏర్పాటు చేసిన వాష్‌ రూమ్‌లో నీళ్లు ఎందుకు లేవు. కాన్వాయ్‌ వెళ్లే దారి చెత్త చెదారంతో ఎందుకు కనిపించింది. ఈ ప్రొటోకాల్ ఉల్లంఘన, ఏర్పాట్ల లోపం వివాదంలో డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్‌, సిలిగురి కమిషనర్‌ లను బాధ్యులుగా పేర్కొంటూ, వారిపై ఏ చర్యలు తీసుకున్నారో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని కేంద్రం గడువు ఇచ్చింది.