Maha Kumbh Mela 2025: పుష్య పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమావేశం. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకు చేరుకున్నారు. ఆమెతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌లు వచ్చారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు సంగంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత ముర్ము, యోగి, పటేల్‌లతో కలిసి పడవలో ప్రయాణించి పక్షులకు ఆహారం పెట్టారు.  కొన్ని రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి పలువురు రాజకీయ నాయకులు కూడా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు.

అంతకుముందు రోజు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ పటేల్, సీఎం యోగి స్వాగతం పలికారు.  "ప్రయాగ్‌రాజ్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పవిత్ర స్నానం చేసి సంగంలో పూజలు చేస్తారు. అక్షయవత్, హనుమాన్ మందిర్‌లలో పూజలు చేస్తారు. అలాగే డిజిటల్ కుంభ్ అనుభవ్ కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు" అని రాష్ట్రపతి భవన్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపోతే దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు.

కుంభమేళాకు తెలంగాణ మంత్రి

కుంభమేళాలో తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పవిత్ర స్నానమాచరించారు. ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సందర్భం 144 సంవత్సరాల తర్వాత వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు చేసిందని కొనియాడారు. ఇటీవల జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వెంకట్ రెడ్డి చెప్పారు.

41 కోట్లకు పైగా పుణ్య స్నానాలాచరించిన భక్తులు 

ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, ఇప్పటివరకు 41 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి అనే మూడు పవిత్రమైన అమృత స్నాన పండుగలు ఇప్పటికే ముగిసినప్పటికీ, భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి కూడా యాత్రికులు సంగంలో పవిత్ర స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.  

Also Read : Gold-Silver Prices Today 10 Feb: రూ.88,000 దిశగా పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ