31 Maoists Killed and 2 Security Personnel Dead In Encounter | బీజాపూర్: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో దేశంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దేశంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఒకటి బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ సమీపంలోని అడవిలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు 11 మంది మహిళా మావోయిస్టులతో సహా 31 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. వీరి మృతదేహాలను బీజాపూర్ జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లను గుర్తించే పనిలో బలగాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో AK 47, SLR, INSAS రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంచర్, BGL లాంచర్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇద్దరు జవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు
అమరవీరులైన ఇద్దరు సైనికుల మృతదేహాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను భారత వైమానిక దళం (IAF) విమానంలో రాయ్‌పూర్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వారి ప్రాణాలకు ముప్పు లేదని సమాచారం. అదనపు DRG/ STF/బస్తర్ ఫైటర్లు/ CRPF దళాలను కూంబింగ్ కోసం పంపారు. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టుల ఉనికిపై సమాచారం రావడంతో బీజాపూర్ DRG/ బస్తర్ ఫైటర్స్/ STF/పార్టీ నక్సల్ వ్యతిరేక సెర్చ్ ఆపరేషన్ కోసం టీం వెళ్లిందని బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
ఆపరేషన్ సమయంలో ఆదివారం ఉదయం 08 గంటలకు, థానా మద్దేడ్ - ఫర్స్‌గఢ్ సరిహద్దు మధ్యలో ఉన్న అడవిలో DRG, STF, బస్తర్ ఫైటర్స్ ఉమ్మడి పార్టీకి, మావోయిస్టులకు మధ్య కాల్పులు ప్రారంభం కాగా, ఇది మధ్యాహ్నం 3-4 గంటల వరకు కొనసాగింది. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత మొత్తం 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో 11 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నారు.
కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
ఎన్‌కౌంటర్‌లో అమరవీరులైన DRG హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధ్రువ్ (భటపారా/ బలాదోబజార్ జిల్లా నివాసి), STF కానిస్టేబుల్ వసిత్ రౌట్ (బలోద్ జిల్లా నివాసి) మృతదేహాలను బీజాపూర్ జిల్లా ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. గాయపడిన DRG కానిస్టేబుల్ జగ్గు కల్ము, STF కానిస్టేబుల్ గులాబ్ మాండవినని ఐఏఎఫ్ విమానంలో రాయ్‌పూర్ తరలించారు. ఎన్‌కౌంటర్‌లో మరింత మంది నక్సలైట్లు గాయపడటం లేదా చనిపోయే అవకాశం ఉందని.. చుట్టుపక్కల ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. 2024లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఆధిపత్యం చెలాయించాం. 2025లోనూ బస్తర్ డివిజన్ పరిధిలో నిషేధం ఉన్న, చట్టవిరుద్ధమైన CPI మావోయిస్టు సంస్థపై నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. గత 40 రోజుల్లో మొత్తం 65 మంది మావోయిస్టులు పలు ఎన్‌కౌంటర్లలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. స్పష్టమైన లక్ష్యంతో, అంకితభావంతో భద్రతా బలగాలు, పోలీసులు పనిచేస్తున్నారు. అమరవీరులైన సైనికుల త్యాగం మావోయిస్టు రహిత భారత్ సంకల్పానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.