Arvind Kejriwal arrested in Delhi Excise Policy Case:
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ చేపట్టిన ఈడీ అధికారులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. రెండు గంటలపాటు విచారించిన అనంతరం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ విషయాన్ని ఆయన సతీమణికి అధికారులు తెలిపారు. అయితే గురువారం రాత్రి కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న సమాచారంతో ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ సీఎం ఇంటికి చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇదివరకే ఆప్ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు అరెస్ట్ అయ్యారు.
మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు ముందే ఆయన నివాసం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీసుకు తరలించకుండా ఉండేందుకు ఆప్ నేతలు, కార్యకర్తలు సీఎం ఇంటి ముందు నిరసన చేపట్టారు. కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించేందుకు పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు. కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్న ఆప్ నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే వందల మందిని అదుపులోకి తీసుకుని బస్సుల్లో పీఎస్ లకు తరలిస్తున్నారు. కేజ్రీవాల్ ఇంటికి దూసుకొస్తున్న ఆప్ శ్రేణులను పోలీసులు, బలగాలు కట్టడి చేయలేకపోతున్నాయి. అయితే ఎలాగైనా రూట్ క్లియర్ చేసి కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీసుకు తరలించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈడీ అధికారులు శుక్రవారం నాడు కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈడీ అరెస్ట్ చేయకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ కు నిరాశే ఎదురైంది. అరెస్ట్ చేయవద్దని ఈడీని తాము ఆదేశించలేమని హైకోర్టు చెప్పింది. ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్ తరఫు లాయర్లను హైకోర్టు ప్రశ్నించింది.
సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆప్ నేతలు
కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయకుండా చూడలేమన్న హైకోర్టు తీర్పుతో, ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పిటిషన్ గా భావించి కేజ్రీవాల్ అరెస్ట్ పై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఢిల్లీ సీఎం తరఫు న్యాయవాదులు కోరారు. తాము ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకుంటామంటూ ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి స్పష్టం చేశారు.