Visakhapatnam  'Operation Trident' during the 1971 Indo-Pak War: 1971 యుద్ధం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన సంఘటన. మన నేవీ ఎంత బలమైనదో ప్రపంచానికి చాటి చెప్పిన సంవత్సరం అది. మన దేశానికి చెందిన అతి ప్రతిష్టాత్మక యుద్ధ నౌక INS విక్రాంత్ ను నాశనం చెయ్యడానికి దొంగ చాటుగా పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీ వైజాగ్ తీరం వైపు వచ్చింది. దీనిని ముందుగానే పసిగట్టిన ఇండియన్ నేవీ విక్రాంత్ నౌకను మరో చోటుకు తరలించి వేరే యుద్ద నౌక INS రాజ్ పుత్ ను ఘాజీ కోసం రెడీ చేసింది. ఇది తెలియని పాక్ సబ్ మెరైన్ ఘాజీ.. విక్రాంత్ తో పాటు విశాఖ నగరాన్ని ధ్వంసం చేసే ప్లాన్ తో విశాఖ తీరానికి చేరుకుంది. అది సరైన టార్గెట్ రేంజ్ కు రాగానే రాజ్ పుత్ దానిపై దాడి చేసింది. ఊహించని ఎటాక్ తో షాక్ కు గురైన పాక్ నేవీకి చెందిన సెయిలర్స్ ఘాజీతో పాటే సముద్ర గర్భంలోనే జల సమాధి అయిపోయారు. 


పాక్ సబ్ మెరైన్ ఘాజీకి చెందిన కొన్ని భాగాలను మాత్రం ఇండియన్ నేవీ అధికారులు బయటకు తీసి విశాఖ ఆర్కే బీచ్ లో గల విశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ సంఘటన 4 డిసెంబర్ 1971 న జరిగింది. అదే సమయంలో ఆపరేషన్ ట్రైడెంట్.. ఆపరేషన్ పైథాన్ లలో భాగంగా పాకిస్థాన్ లోని కరాచీ హార్బర్ పై ఇండియన్ నేవీ దాడి చేసి 4 యుద్ద నౌకలను ముంచేసింది. దానితో పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 4వ తేదీని ఏటా నేవీ డే (Navy Day)గా జరుపుకుంటుంది. అయితే ఘాజీ పాకిస్తాన్ సబ్ మెరైన్ అని మాత్రమే తెలుసుగానీ దాని వెనుక ఉన్న చరిత్ర చాలా పెద్దది. అదేంటో ఇక్కడ తెలుసుకుందామా ?


ఎంతో శక్తి వంతమైన ఘాజీ సబ్ మెరైన్ పాక్ చేతికి ఎలా వెళ్ళింది ?
PNS ఘాజీ అనేది పాక్ సబ్ మెరైన్ అని మాత్రమే మనకు తెలుసుగానీ దాని వెనుక ఉన్న హిస్టరీ పెద్దదే. నిజానికి దానిని తయారుచేసింది అమెరికా. దానిపేరు ఘాజీ కాదు. అసలుపేరు "డయబోలో (Diablo). రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మరోసారి అటువంటి పరిస్థితి వస్తే దూరదేశ సముద్రతీరాల్లో కూడా యుద్ధం చేసేలా శక్తివంతమైన సబ్ మెరైన్ లాతయారీకి పూనుకుంది అమెరికా. అలానే వీలైనంత లోతుకు వెళ్లి ప్రయాణించేలా క్రొత్త రకం సబ్ మెరైన్ లను తయారీ చెయ్యడం మొదలు పెట్టింది. వాటికి ట్రెంచ్ -క్లాస్ సబ్ మెరైన్ లని పేరు పెట్టింది. అంతవరకూ ఉన్న గాటో (Gato ), బలోవ్ (Balao ) తరహా సబ్ మెరైన్ లకంటే చాలా శక్తివంతమైన సబ్ మెరైన్లు ఇవి. పైగా సముద్రం అడుగున మైన్స్ (బాంబులను ) అమర్చడం లో ఇవి పేరుగాంచాయి. 
అంతకుముందున్న సబ్ మెరైన్‌లు 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగితే ఈ ట్రెంచ్ క్లాస్ సబ్ మెరైన్ లు ఏకంగా 30,000 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే కెపాసిటీతో తయారయ్యాయి. వీటిని అమెరికా 1944-51 మధ్య అమెరికన్ నేవీ కోసం తయారుచేశారు. వీటిలో ముఖ్యమైనది USS డయబోలో. అమెరికన్ నేవీలో అదే పేరుతో 1945 నుండి 1963 వరకూ పనిచేసిన ఈ సబ్ మెరైన్ ను పాకిస్తాన్ 4 ఏళ్ల లీజుకు ఇచ్చేలా ఒప్పించింది. దీనికోసం అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ కెన్నడీ ని పాక్ అధ్యక్షడు ఆయూబ్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశారు. దీనికి సెక్యూరిటీ అసిస్టెన్స్ ప్రోగ్రాం క్రింద అమెరికా ఒప్పుకున్నప్పటికీ అదే ఏడాది 1963 లో కెనడీ హత్య జరగడంతో కాస్త లేటుగా అంటే 1964 లో USS డయబోలో సబ్ మెరైన్ పాక్ కు చేరుకుంది. పాక్ దానిని ఇండియాను ఎదుర్కోవడం కోసమే రప్పించింది అనేది బహిరంగ రహస్యమే. నాలుగేళ్ల లీజ్ పూర్తయ్యాక కూడా తన దగ్గరే దానిని ఉంచుకునేలా అమెరికాను ఒప్పించింది. ఆ సబ్ మెరైన్ కు PNS ఘాజీ అనే పేరు మార్చి 1965 వార్ లో వాడిన పాక్ 1971 లో పెద్ద మిషన్ మీదే ఇండియాకు పంపింది. 


ఘాజీ టార్గెట్ విశాఖ లోని INS విక్రాంత్ :
1971 యుద్ధంలో భాగంగా  ఇండియన్ నేవీ అమ్ములపొదిలోని ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ యుద్ధనౌక INS విక్రాంత్ ను ధ్వంసం చేసే టార్గెట్ తో విశాఖ తీరం చేరుకుంది ఘాజీ. దీని రాకను ముందే ఊహించిన తూర్ప తీర నౌకాదళ వైస్ అడ్మిరల్ నీలకంఠ కృష్ణన్ విక్రాంత్ ను అండమాన్ తీర సమీపానికి పంపి.. మరో యుద్ధనౌక INS రాజ్ పుత్ ను ఘాజీపై దాడి కోసం రెడీ చేశారు. అదే సమయంలో తీరంలో ఉన్న రాజ్ పుత్ నౌకనే విక్రాంత్ అనేలా ఘాజీని నమ్మించారు. ఆ ట్రాప్ లో పడ్డ ఘాజీ విశాఖ సముద్రతీరంలో నీటి అడుగున మైన్స్ అమర్చేపనిలో పడింది. ఆ సమయంలో దాని బేకన్ లైట్ ను పసిగట్టిన రాజపుత్ నౌక ఘాజీ పై ఎటాక్ చేసినట్టు నేవీ రికార్డ్స్ చెబుతున్నాయి. దానితో నీటి అడుగునే పేలిపోయిన ఘాజీ తనలోని 93 మంది పాక్ నావికులతో సహా ( 11 మంది ఆఫీసర్ ర్యాంక్ అధికారులు 82 మంది నావికులు ) జల సమాధి అయింది . నిజానికి విక్రాంత్ గనుక ఘాజీ బారిన పడి ఉంటే ఆ యుద్ధఫలితమే వేరేలా ఉండేదేమో అంటారు నేవీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఠాగూర్. ఇది జరిగింది 4 డిసెంబర్ 1971. అదేరోజు పాక్ లోని కరాచీ హార్బర్ పై దాడి చేసిన ఇండియన్ నేవీ 4 యుద్ధ నౌకలను ధ్వంసం చేసి సురక్షితంగా తిరిగి వచ్చింది. ప్రపంచ నేవీ చరిత్రలోనే అతిగొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సంఘటనలు భారత్ నేవీ శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. ఈ విజయాలకు గుర్తుగానే 4 డిసెంబర్ ను ప్రతీ ఏడూ నేవీ డే గా జరుపుతుంది భారత ప్రభుత్వం. 


తరువాత ఘాజీ ఏమైంది :
4 డిసెంబర్ 1971 అర్ధరాత్రి విశాఖ తీరంలో జలసమాధి అయిన PNS ఘాజీ శకలాలు నీటి అడుగునే ఉండిపోయాయి. ఉదయం ఆ ప్రదేశానికి పరిశీలన కోసం వెళ్లిన ఇండియన్ నేవీ కి ఘాజీ కి చెందిన కొన్ని భాగాలు నీటిపై తేలుతూ కనిపించాయి. వాటిలో ఘాజీకి చెందిన గ్లాస్ డోమ్ సహా కొన్ని ఇతర తేలికపాటి పరికరాలు ఉన్నాయి. వాటిని సేకరించిన నేవీ విశాఖలోని RK బీచ్ వద్ద గల మ్యూజియంలో భద్రపరిచింది. వీటిని చూడడానికి ప్రతీ రోజూ పర్యాటకులు మ్యూజియంకు వస్తుంటారు. అయితే ప్రస్తుత జెనరేషన్ లోని పిల్లలకు కూడా వీటి చరిత్రను వివరించాల్సిన అవసరం ఉందని నాటి ఘటనలు తెలిసిన విశాఖ వాసులు చెబుతుంటారు.