Indias Operation Sindoor | న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం మొదలుపెట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ ప్రతీకాదర దాడులతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిద్రలేకుండా చేసి కాళరాత్రిని మిగిలిచ్చింది భారత సైన్యం. పీఓకేలోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడి ఆపరేషన్ సిందూర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ రాత్రంతా నిరంతరం పర్యవేక్షించారని కొందరు అధికారులు ఏఎన్ఐకి తెలిపారు.
ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఏం చేస్తుంది అనే దానికి మంగళవారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమాధానంగా మారింది. భారత బలగాలు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడులు విజయవంతమయ్యాయని భారత వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన జైషే ఈ ముహమ్మద్, లష్కరే తోయిబా అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దాడులు చేశాయి. భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా ఆపరేషన్ సిందూర్‌ను పర్యవేక్షించారు. అంటే ఉగ్రదాడులను సహించేది లేదని, పహల్గాం దాడికి అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటామని మన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.
పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు..మేం కేవలం ఉగ్రవాదంపై, ఉగ్రవాదులపై దాడులు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు భారత సైన్యం పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ((PoK)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్‌పై ఎక్కడి నుంచి ఉగ్రదాడులకు ప్లాన్ చేశారో.. అదే స్థావరాలపై సైన్యం దాడి చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన తెలిపింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, నేపాల్ కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అందుకే పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఈ చర్యలు చేపట్టిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధ్యులను జవాబుదారీగా ఉంచాలని, వారికి భారత బలగాలు సత్తా చూపించామన్నారు.
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లోని 9 ఉగ్రవాద స్థావరాలపై పక్కా సమాచారంతో, ప్లాన్ చేసి భారత సైన్యం, నావికాదళం, ఎయిర్ ఫోర్స్ ఈ దాడుల్లో పాల్గొన్నాయి. భారత్‌లో ఉగ్రదాడులకు కారణమైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలను నామరూపం లేకుండా చేయాని వారి స్థావరాలపై భారత్ బుధవారం తెల్లవారుజాము వరకు మెరుపు దాడులు చేసింది.