Emojis In Social Media Posts: గత కొద్ది రోజులుగా ఇండియాలో ట్రెండింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చెందిన రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ (Dheeraj Sahu)పై ఐటీ దాడులు జరగడమే. ఎంపీ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.350 కోట్లకు పైగా పట్టుబడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అందరూ స్పందించడం కామన్. కానీ నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పందించారు. అది కూడా తన శైలికి కొత్తగా సోషల్ మీడియాలో (Social Media) ఎమోజీ(Emojis)లతో కాంగ్రెస్ ఎంపీ అవినీతిపై ఘాటుగా వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ప్రముఖ వెబస్‌ సిరీస్ 'మనీ హీస్ట్' (Money Heist)కు చెందిన వీడియోను ఉపయోగించి బీజేపీ చేసిన పోస్ట్‌ను మంగళవారం ప్రధాని మోదీ రీట్వీట్ చేశారు.  


డిసెంబరు 8న, ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ అవినీతి గురించి పోస్ట్ చేశారు. నగదుతో నింపిన అల్మారాలతో ప్రచురితమైన వార్తాపత్రికలను పోస్ట్ చేశారు.  దేశప్రజలు ఈ కరెన్సీ నోట్ల కుప్పలను చూసి ఆ తర్వాత తమ నాయకుల నిజాయితీ 'ప్రసంగాలను' వినాలంటూ సటైర్లు వేశారు. దోచుకున్న ప్రజాధనం  ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందే. ఇది మోడీ హామీ అంటూ పోస్ట్ చేశారు.  


ఈ పోస్ట్‌లో గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హిందీలో చేసిన ఆ ట్వీట్ ఎర్రని క్రాస్, బ్యాంక్ నోట్ ఎమోజీలతో నిండి ఉంది. అందులో కన్నీళ్లతో నవ్వుతున్నట్లు ఎమోజీలు కూడా ఉన్నాయి. ప్రధాని ఎమోజీలతో పోస్ట్ చేసిన రెండో ట్వీట్ ఇది. ఎమోజీలు చాలా సాధారణం, మన భావాలను తెలియజేయడానికి వాటిని ఉపయోగిస్తాం. చిత్రాల మాదిరిగానే, ఎమోజీ కూడా వెయ్యి పదాలను తెలియజేస్తుంది. ఒక ఉన్నత పదవిలో ఉన్న నాయకుడు  ఎమోజీలను ఉపయోగించడం అసాధారణం. 




కానీ ప్రధాని వాటిని ఉపయోగిస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభావ‌వంత‌మైన క‌మ్యూనికేట‌ర్‌గా ఇప్పటికే పేరు పొందారు. ఎప్పటికప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందుంటారు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. డిసెంబర్ 5న X లో చేసిన పోస్ట్‌లో మోదీ మొదట ఎమోజీలను ఉపయోగించారు. అది కాస్తా ఇంటర్నెట్‌‌లో వైరల్ అయ్యింది.  ఓ టీవీ వీడియో క్లిప్‌ను ప్రధాని మోదీ Xలో పంచుకున్నారు. అందులో హెచ్చరికలు, నవ్వుల ఎమోజీలు ఉన్నాయి. 


ఇలా మొదటిసారి ఎమోజీలతో ట్వీట్ రావడం చూసి చాలా మంది ప్రధాని మోదీ ట్విటర్ హ్యాక్ అయ్యిందని భావించారు. తరువాత వరుసగా వచ్చిన ట్వీట్లను చూసి ఇది హ్యాకర్ల పని కాదని నిర్ధారించుకున్నారు. ప్రధాని మోదీ దేశంలోని యువతను కనెక్ట్ అవ్వడానికి ఎమోజీలు, పాప్-కల్చర్ సూచనలను ఉపయోగిస్తున్నారు. ఈ ఎమోజీల భాషా అన్ని భాషా అడ్డంకులను దాటుతుంది. జనాదరణ పొందిన ఈ ఎమోజీ సంస్కృతి యువతలో ఎక్కువగా ఉంది. వారిని ఆకట్టుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 




ప్రధాని దృష్టి ఎప్పుడూ దేశంలోని యువతపైనే ఉంటుంది. యువత అభివృద్ధి కోసం ప్రభుత్వం మేరా యువ భారత్ అనే స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోని యువత భారతదేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అనేక ప్రసంగాలలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 2024లో ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే ఐదేళ్లపాటు దేశాన్ని ఎవరు నడిపించాలో కూడా దేశంలోని యువత నిర్ణయిస్తారు. 2024లో 8.3 మిలియన్ల మంది మొదటిసారి ఓటు వేసే వారు ఉన్నారు.


అవినీతి, ఇతర కీలక అంశాలను వారి భాషలోనే వారికి తెలియజేయడం చాలా కీలకం. ఇందులో భాగంగానే మోదీ  ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.  ఓటర్లలో ఎక్కువ శాతం మంది సోషల్ మీడియా, పాప్ సంస్కృతిని అనుసరిస్తున్నారు. వారి కోసం ప్రధాని మోదీ ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.  దేశం నాడిని బాగా అర్థం చేసుకున్న ప్రముఖ నాయకుడిగా మోదీ పొందారు. తాజాగా ఎమోజీలతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు.