Union Cabinet Reshuffle | న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలిలో భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయని కొన్ని రోజుల నుంచి వినిపిస్తోంది. చివరి క్షణం వరకూ ఏ విషయం బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ఈ వర్షాకాల సమావేశాల్లోపే కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగవచ్చని తెలుస్తోంది. ఖాళీ అయిన శాఖలతో పాటు త్వరలో ఖాళీ కాబోయే స్థానాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతోంది. ఈ మంత్రివర్గ విస్తరణలో తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) పార్టీల నుంచి చీలిక వర్గాల నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎంపీలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సైతం మంత్రి పదవి దక్కుతుందని కొందరు ఎంపీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొందరికి గవర్నర్లుగా అవకాశం..
పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు ఎంపీలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోనుండగా, మహారాష్ట్రలోని ఏకనాథ్ షిందే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్ నేతకు మంత్రి పదవి ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వచ్చిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఇందులో ప్రధానంగా రాఘవ్ చద్దా రేసులో ఉన్నారు. మరోవైపు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్ల పదవీ కాలం ముగియనుండటంతో, ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో కొందరిని గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఆ పదవులను యువ నేతలకు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
Also Read: Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సారథి నితిన్ నబీన్ టీమ్‌లో యువ నేతలకు కీలక పదవులను అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల కొందరు కేంద్ర మంత్రులతో నితిన్ నబీన్ చర్చించారు. కొందరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు పార్టీలోనూ పదవుల మార్పులు చేర్పులు ఏకకాలంలో జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. బెంగాల్ మ్యాజిక్ ఇతర రాష్ట్రాల్లోనూ రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని హైదరాబాద్ లోని కార్యక్రమంలో నితిన్ నబీన్ అన్నారు.
ఆ మంత్రి పదవిపైనే ప్రజల చూపు..
కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొందరు కేంద్ర మంత్రులకు పదవీ గండం తప్పేలా లేదు. ముఖ్యంగా నీట్ (NEET) ఎగ్జామ్ పేపర్ లీకేజీ వివాదం, సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకన తప్పులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ పదవీకాలం ముగిసిపోతున్న హర్‌దీప్‌సింగ్ పురీ, బి.ఎల్ వర్మలకు మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది. ఒకరికి ఒకే పదవి రూల్ పాటిస్తారు కనుక యూపీ, ఢిల్లీ పార్టీ బాధ్యతలు చేపట్టిన పంకజ్ చౌధరి, హర్ష్ మల్హోత్రాలు కేబినెట్ నుంచి బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఇటీవల రాజీనామా చేశారు. పంజాబ్ ఎన్నికల కోసం బిట్టూకు మరో ఛాన్స్ లభిస్తుందని సమాచారం.
