PM Modi UAE Visit Updates: అబుదాబిలోని ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే. ఈ సందర్భంగా మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీని చూసేందుకు వందలాది మంది భారతీయులు ఆలయం వద్దకు చేరుకున్నారు. "మోదీ మోదీ" అంటూ నినాదాలు చేశారు. ప్రారంభోత్సవానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయం ఇదే కావడం విశేషం. 2015 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈకి రావడం ఇది ఏడోసారి. ఈ ఆలయ ప్రారంభోత్సవంపై BAPS Swaminarayan Mandir సాధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గాయకుడు శంకర్ మహదేవన్‌తో పాటు నటుడు అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఇలాంటి గొప్ప పనులు ప్రధాని మోదీతోనే సాధ్యం అవుతాయని శంకర్ మహదేవన్ ప్రశంసలు కురిపించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆలయానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ...ఇప్పటికే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లడంపై కీలక చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ UAEలో తొలి Bharat Mart ని ప్రారంభించారు.
ఆలయ విశేషాలివే...
1. అబుదాబి దుబాయ్ హైవేకి సమీపంలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మొత్తం 27 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టారు.
2. 2019 నుంచి ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. 2015లో యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం 13.5 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ తరవాత 2019లో మరోసారి 13.5 ఎకరాలను అందించింది. ఇలా మొత్తంగా 27 ఎకరాల్లో నిర్మాణాన్ని చేపట్టేలా సహకరించింది.
3.ఈ ఆలయాన్నీ అయోధ్య తరహాలోనే నాగర శైలిలో నిర్మించారు. మొత్తం ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు. ఆలయ ముందు భాగంలో హిందూ సంస్కృతి విలువలు ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టారు. రకరకాల సంస్కృతులను,ఆధ్యాత్మికవేత్తల చిత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం UAEలోని 7 ఎమిరేట్స్‌ని సూచించేలా ఏడు శిఖరాలు నిర్మించారు.
4.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రారంభమైనప్పటికీ ఇది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది
5. మొత్తం రాతితోనే ఈ నిర్మాణాన్ని చేపట్టారు. స్టీల్, కాంక్రీట్‌ని వినియోగించలేదు. ఇది గల్ఫ్‌లోనే మూడో అతి పెద్ద నిర్మాణంగా రికార్డు సృష్టించింది. UAEలోని దుబాయ్‌లో మూడు హిందూ ఆలయాలున్నాయి.
6. ఈ ఆలయంలో విజిటర్స్ సెంటర్, లైబ్రరీ, క్లాస్‌రూమ్, ప్రేయర్ రూమ్, కమ్యూనిటీ సెంటర్, ప్లే గ్రౌండ్ నిర్మించారు. వీటితో పాటు పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటవుతుంది.
పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం...దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. సంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతీకగా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు. ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయం దాని వైభవాన్ని పెంచే ఐదు అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి. ఆలయం శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది.