PM MODI: చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై విక్రం ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించేందుకు ఈ నెల 26వ తేదీన మోదీ బెంగళూరు వెళ్లనున్నారు. చంద్రయాన్-3 మిషన్ వెనుక ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధాని భేటీ కానున్నారు.
బ్రిక్స్ సదస్సు దృష్ట్యా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ అక్కడినుంచి గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి భారత్‌కు చేరుకోనున్నారు. అక్కడి పర్యటన అనంతరం మోదీ నేరుగా బెంగళూరు వెళ్లనున్నారు. ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్)ను సందర్శించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని భేటీ కానున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఈ భేటీ జరుగనుంది. అనంతరం ఉదయం 8.05 అక్కడి నుంచి బయలుదేరి 8.35 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక తెలిపారు. పార్టీ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ ఆదేశాల మేరకు నగరంలో 10 వేల మందితో మెగా రోడ్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని కర్ణాటకలో పర్యటించడం ఇదే తొలిసారి.
మోదీకి హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ సిద్ధమైంది. 2023లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పార్టీ, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ప్రధాని పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం 4.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రధాని ప్రయాణించే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఇస్రో శాస్త్రవేతలతో భేటీ అనంతరం మోదీ ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
అభినందనలు తెలిపిన ప్రధాని
స్పేస్ సైన్స్ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవంపై భారత్ విజయవంతంగా తన విక్రమ్ రోవర్ ను చేర్చటంలో సఫలం కావటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని కొనియాడారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు. చంద్రయాన్ విజయం దేశం గర్వించే మహత్తరమైన క్షణాలుగా ప్రధాని అభివర్ణించారు. దీంతో ఇండియా ప్రపంచపటంలో కొత్త చరిత్రకు నాంది పలికిందని అన్నారు.
ఇది అమృతకాలంలో నెలకొన్న తొలి ఘన విజయం ఇదని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైనప్పటికీ తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని చెప్పారు. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం. అద్భుత విజయం కోసం 140కోట్ల మంది ఎదురు చూశారన్నారు. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశా’నని అని మోదీ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.