PM Modi: ప్రచారం తరువాత రెస్ట్ మోడ్‌లోకి ప్రధాని మోదీ, ఈ సారి ఎక్కడికి వెళ్తున్నారంటే!

PM Modi Meditation Break: ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద వెళ్లి ధ్యానం చేయనున్నారు.  

Continues below advertisement

Lok Sabha Elections 2024:  దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) చివరి దశకు చేరుకున్నాయి. చివరి, ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇప్పటికే ఆరు దశలో పోలింగ్ పూర్తవడంతో రాజకీయ నేతలు అంతా వెకేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కుటుంబంతో సహా ఫారిన్ టూర్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు చుట్టేస్తున్నారు. ప్రధాని మోదీ (PM Modi) సైతం బీజేపీ, ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు. రోజుకు నాలుగైదు బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ప్రచారం చేశారు. ఏడో విడత ఎన్నికల ప్రచారం ఈ నెల 30తో ముగియనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు (Tamil Nadu)లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన ప్రధాని మోదీ కన్యాకుమారి (Kanniyakumari)లోని వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం చేయనున్నారు.  

Continues below advertisement

30వ తేదీ ప్రధాని పర్యటన సాగుతుందిలా
చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి తమిళనాడు చేరుకుంటారు. 31వ తేదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌కు వెళ్తారు. అక్కడ రెండు రోజుల పాటు ధ్యానం చేస్తారు. 2019 ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ కేదార్ నాథ్‌కు వెళ్లారు. అక్కడ రుద్ర గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే. 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ఈసారి తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు.

కన్యాకుమారికి స్వామి వివేకానందకు సంబంధం ఏంటి?
కన్యాకుమారిలో స్వామి వివేకానందకు భారత మాత దర్శనం కలిగిందని చెబుతారు. స్వామి వివేకానంద 1893లో ప్రపంచ మతాల మండలిలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేముందు 1892 డిసెంబర్ 24న కన్యాకుమారిని సందర్శించారని ప్రచారంలో ఉంది. సముద్ర తీరానికి దాదాపు 500 మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ బండ కనిపించింది. స్వామి వివేకానంద ఈదుకుంటూ అక్కడికి చేరుకుని ధ్యానంలో మునిగిపోయారు. 

భారతమాత దర్శనం
వివేకానంద ధ్యానం చేస్తుండగా భారత మాత దర్శనం ఇచ్చిందని ప్రతీతి. అందుకే విశ్వఖ్యాతి సంపాదించి నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడు. స్వామి వివేకానంద  ధ్యానం చేసిన ప్రదేశాన్ని ధ్యాన్ మండపం అని పిలుస్తారు. 1970లో ఇక్కడ స్మారక భవనాన్ని నిర్మించారు. ఇందులో నాలుగు మంటపాలు ఉన్నాయి. దీని నిర్మాణం పురాతన శైలిలో ఉంటుంది. దీని 70 అడుగుల ఎత్తైన గోపురం ఎరుపు, నీలం గ్రానైట్‌తో నిర్మించారు. ఈ స్థలం 6 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ కంచుతో చేసిన ఎనిమిదిన్నర అడుగుల ఎత్తున్న స్వామి వివేకానంద పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

చారిత్రాత్మక నేపథ్యం
ఈ రాయికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం సముద్రపు నీటిలో ఉన్న ఈ రాతిపై కన్యాకుమారి దేవి శివుడిని పూజిస్తూ తపస్సు చేసిందని ఇక్కడి వారు చెబుతారు. అందుకే ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. ఇక్కడ నిర్మించిన స్మారక భవనంలో నమస్తుభ్యం, జగదాంబ అనే అసెంబ్లీ హాలు, సభా మండపం ఉన్నాయి. ఈ స్మారక చిహ్నం ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది.   

Continues below advertisement