బెంగళూరు: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నమెట్రో రైలు యెల్లో లైన్‌ను.. బెంగళూరు - బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఆగస్టు 10న ప్రారంభిస్తారు. పీఎంఓ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీ బెంగళూరు నగరంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉండనున్నారు. పర్యటనలో భాగంగా బెంగళూరులో మూడు కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు.
ఆదివారం ఉదయం 10.30 గంటలకు HAL విమానాశ్రయంలో దిగిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్, తరువాత రోడ్డు మార్గంలో KSR బెంగళూరు (సిటీ) రైల్వే స్టేషన్‌కు ఆయన చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ KSR బెంగళూరు- బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లను ప్రారంభిస్తారు. అమృత్‌సర్- శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా, అజ్ని (నాగ్‌పూర్)- పూణే lనగరాల మధ్య మరో ర2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడి నుంచే ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో యెల్లో లైన్‌లోని RV రోడ్ (రాగిగుడ్డ) మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. 11:45 గంటల నుంచి 12:50 గంటల మధ్య ఆయన బెంగళూరు యెల్లో లైన్ (రీచ్ 5)ను ప్రారంభిస్తారు. అనంతరం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణిస్తారు.
అక్కడి నుండి భారత ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆడిటోరియంలో బెంగళూరు మెట్రో రైలు ఫేజ్-3కి శంకుస్థాపన చేస్తారు. RV రోడ్ (రాగిగుడ్డ) స్టేషన్ నుంచి బొమ్మసంద్ర స్టేషన్ వరకు బెంగళూరు యెల్లో లైన్‌ను మోదీ అధికారికంగా ప్రారంభిస్తారు.
16 స్టేషన్లు.. 5,056.99 కోట్ల వ్యయం
అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్ ద్వారా HAL విమానాశ్రయానికి చేరుకుని ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళతారు. బెంగళూరు మెట్రో RV రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు యెల్లో లైన్ 19.15 కిలోమీటర్ల 16 స్టేషన్లు ఉన్నాయి. రూ. 5,056.99 కోట్ల వ్యయంతో ఎల్లో లైన్ మెట్రో నిర్మించారు. ఈ ఎల్లో లైన్ హోసూర్ రోడ్, సిల్క్ బోర్డ్ జంక్షన్.. ఎలక్ట్రానిక్స్ సిటీ జంక్షన్ లాంటీ రద్దీగా ఉండే కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో ఫేజ్ 3ని ఆరెంజ్ లైన్ అని కూడా పిలుస్తారు, ఇది 44.65 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని సుమారు రూ. 15,611 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దీనికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.