పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదముద్ర పడింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్ పాసయినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ లో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు. నారీ శక్తి వందన్ బిల్లు' లోక్‌సభలో ఆమోదం పొందడంతో దేశప్రజలకు అభినందనలు తెలిపారు.
బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాన మంత్రి మోడీ ట్వీట్ చేశారు. ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా కోటా బిల్లు ఆమోదం పొందడం పట్ల సంతోషంగా ఉందని, సహకరించిన ఎంపీలకు పార్టీలకతీతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోడీ తెలిపారు. నారీ శక్తి వందన్ బిల్లు ఒక చారిత్రాత్మక చట్టం, ఇది మహిళా సాధికారతను మరింత పెంపొందిస్తుందన్నారు. రాజకీయ ప్రక్రియలో మహిళలు మరింత ఎక్కువ భాగస్వామ్యం అయ్యేందుకు బిల్లు అవకాశం కల్పిస్తుందని మోడీ తెలిపారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నారీ శక్తి వందన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, ఇది మన దేశానికి చారిత్రాత్మకమైన ముందడుగు అని అన్నారు. ప్రధాని మోడీ ఊహించిన బిల్లు మహిళా సాధికారత చరిత్రలో కొత్త అధ్యాయం అన్నారు. సమానమైన, లింగ-సమగ్ర అభివృద్ధిని బిల్లు ప్రోత్సహిస్తుందన్నారు. మహిళల నేతృత్వంలోని పాలనకు మోడీ ప్రభుత్వ చిత్తశిుద్దితో పని చేస్తుందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్దిసేపటి ముందు ప్రధాని మోడీ సభలోకి వచ్చారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సోనియా గాంధీ, మహువా మోయిత్రా, కనిమోళి, సుప్రియా సూలే, నవనీత్ కౌర్ సహా 60 మంది సభ్యులు 'నారీ శక్తి వందన్ బిల్లు'పై చర్చలో పాల్గొన్నారు. చర్చ సందర్బంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్, రాణి దుర్గావతి, రాణి చెన్నమ్మ, రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మి వంటి నాయికల గురించి ప్రస్తావించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023పై గురువారం రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చకు ఏడున్నర గంటల సమయం కేటాయించారు. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం ఫలించినట్లు అవుతుంది.