Modi Speech In Parliament: ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్, ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పండిట్ నెహ్రూ విధానాల నుంచి పాకిస్తాన్, చైనా పట్ల కాంగ్రెస్ బలహీన విధానాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. సైనికులను ప్రశంసిస్తూ భారతదేశం ఏ ఉగ్రవాద దాడికైనా తగిన సమాధానం ఇవ్వగలదని దేశం నిరూపించిందని మోదీ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు, భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణలో తన పాత్ర ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ భారతదేశం తన సొంత నిర్ణయాలు తీసుకుంటుందని, బయట వ్యక్తుల ప్రమేయం మన విధానాన్ని నిర్ణయించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశానికి అంతర్జాతీయంగా విస్తృత మద్దతు లభించిందని, ప్రపంచం ఇప్పుడు భారత్‌కు మద్దతుగా నిలబడిందని ఇది స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్ పై చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:
- ప్రధాని మోదీ మాట్లాడుతూ, 'నేను (జవహర్‌లాల్) నెహ్రూజీ గురించి ప్రస్తావించినప్పుడల్లా, కాంగ్రెస్, దాని మొత్తం 'ఎకోసిస్టమ్' బాధపడుతుంది. ' భారతదేశ ప్రయోజనాలను 'అమ్మడం' కాంగ్రెస్ పాత అలవాటు అని, నెహ్రూజీ పాకిస్తాన్‌తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం దీనికి అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు.
- ఆయన మాట్లాడుతూ, 'సింధు జలాల ఒప్పందం భారతదేశ గౌరవం, ఆత్మగౌరవానికి చేసిన అతిపెద్ద మోసం. దేశంలోని చాలా పెద్ద భాగాన్ని నీటి సంక్షోభంలోకి నెట్టారు.'దేశ ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ, ఈ ఒప్పందం కారణంగా దేశం చాలా వెనుకబడిందని, 'మన రైతులు వ్యవసాయంలో నష్టపోయారు. నెహ్రూజీకి రైతులకు విలువ లేని 'డిప్లొమసీ' తెలుసు.' నెహ్రూజీ పాకిస్తాన్ చెప్పిన మేరకు ఆనకట్టలో పేరుకుపోయిన పూడికను శుభ్రం చేయకూడదనే షరతును అంగీకరించారని ఆయన పేర్కొన్నారు.
- తరువాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాలు నెహ్రూజీ చేసిన ఈ తప్పును సరిదిద్దలేదని, అయితే ఈ పాత తప్పును ఇప్పుడు సరిదిద్దామని, దృఢమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ప్రధాని మాట్లాడుతూ, 'నెహ్రూజీ చేసిన 'బ్లండర్' (సింధు జలాల ఒప్పందం) దేశ ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాల కోసం ఇప్పుడు నిలిపివేశాం. రక్తం- నీరు కలిసి ప్రవహించలేవని భారతదేశం నిర్ణయించింది.' కాంగ్రెస్ పార్టీకి జాతీయ భద్రతపై 'దృష్టి' గతంలో లేదు, ఇప్పటికీ లేదు, 'ఎల్లప్పుడూ జాతీయ భద్రతతో రాజీ పడుతోంది' అని అన్నారు.
- మే 6, 7 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో భారతదేశం ప్రణాళిక ప్రకారం సైనిక చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. ఏప్రిల్ 22న జరిగిన ఘటనకు మన సాయుధ దళాలు 22 నిమిషాల్లోనే చ్చితమైన దాడితో బదులిచ్చాయి.
- నిన్న మన సాయుధ దళాలు ఆపరేషన్ మహాదేవ్ కింద పహల్గాం దాడి చేసిన వారిని మట్టుబెట్టాయి. అయితే, ఇక్కడ కొందరు నవ్వుకోవడం, 'ఇది నిన్న ఎందుకు జరిగింది?' అని అడగడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆపరేషన్ కోసం 'శ్రావణ సోమవారం' నిర్ణయించారా? వీళ్ళకి ఏమైంది? ఇంత నిరాశనా? గత కొన్ని వారాలుగా, 'పహల్గాం ఉగ్రవాదులకు ఏమైంది?' అని ప్రశ్నిస్తున్నారు, చర్య తీసుకున్నప్పుడు, ఇప్పుడు దాని సమయం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
- ఏప్రిల్ 22 తర్వాత, ఇది మా సంకల్పం అని నేను చెప్పాను - మేము ఉగ్రవాదులను నిర్మూలిస్తాము. వారి కుట్రదారులకు కూడా శిక్ష తప్పదని నేను బహిరంగంగా చెప్పాను... వారు ఊహించని శిక్ష పడుతుంది. ఉగ్రవాదులకు అలాంటి శిక్ష విధించినందుకు మేము గర్విస్తున్నాము, నేటికీ వారి మద్దతుదారులకు నిద్ర కరువైంది.
- ఇప్పటివరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించేవారిని నేను అడుగుతున్నాను - మొదట, పాకిస్తాన్ పీఓకేని ఆక్రమించుకోవడానికి ఏ ప్రభుత్వం అనుమతించింది? సింధు జలాల ఒప్పందం ఎవరు చేసుకున్నారు? పండిట్ నెహ్రూ. ఆయన భారతదేశ నదుల నుంచి వచ్చే నీటిలో 80 శాతం నీటిని పాకిస్తాన్‌కు ఇచ్చి, భారతదేశానికి కేవలం 20 శాతం నీటిని మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం వెనుక ఎవరు ఉన్నారు? నెహ్రూ. ఈ ఒప్పందం దేశానికి చేసిన ద్రోహం.
- సింధూర్ నుంచి సింధు వరకు - ప్రపంచం మన సైనిక చర్యల స్థాయిని చూసింది. ఆపరేషన్ సింధూర్ మూడు విషయాలను స్థాపించింది - మొదటిది, భారతదేశంపై ఉగ్రవాద దాడి జరిగితే,ప్రణాళిక, షరతులపై స్పందిస్తాము. రెండోది అణు ఆయుధాల బెదిరింపులు ఇకపై పనిచేయవు. మూడవది, ఇప్పుడు ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే ప్రభుత్వాలను వేరుగా చూడబోం.
- భారతదేశం తనను తాను రక్షించుకునే హక్కును ఉపయోగించకుండా ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆపలేదు. 193 దేశాలలో, కేవలం 3 మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాయి. క్వాడ్ అయినా, బ్రిక్స్ అయినా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా అయినా - ప్రపంచమంతా భారతదేశం పక్కన నిలబడ్డాయి. మాకు అంతర్జాతీయ మద్దతు లభించింది, కాని దురదృష్టవశాత్తు, నా దేశంలోని వీరులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. దాడి తర్వాత పాకిస్తాన్ సంప్రదించింది. మా డిజిఎంఓ ముందు వారు విజ్ఞప్తి చేశారు - 'చాలు... చాలా కొట్టారు, ఇక మేము భరించలేము, దయచేసి దాడిని ఆపండి.' అని ప్రాధేయపడ్డారు.
- అమెరికా ఉపాధ్యక్షుడు (జేడీ వాన్స్) నన్ను సంప్రదించడానికి 3-4 సార్లు ప్రయత్నించారు, కాని నేను ఆ సమయంలో సాయుధ దళాలతో సమావేశాలలో బిజీగా ఉన్నాను. నేను తిరిగి కాల్ చేసినప్పుడు, పాకిస్తాన్ నుంచి పెద్ద దాడి గురించి ఆయన నాకు హెచ్చరించారు. నేను వారికి సమాధానం ఇచ్చాను - పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తే, మా సమాధానం దానికంటే చాలా రెట్లు పెద్దదిగా ఉంటుంది. 'మేము బుల్లెట్‌కు బల్లెట్ సమాధానం ఇస్తాము.'
- భారతదేశం ప్రతిస్పందన ప్రతిసారీ మునుపటి కంటే మరింత కఠినంగా ఉంటుందని పాకిస్తాన్‌కు బాగా తెలుసు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే, భారతదేశం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని వారికి తెలుసు. అందుకే నేను ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో పునరుద్ఘాటిస్తున్నాను - ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా పనికిమాలిన పని చేస్తే, దానికి తగిన సమాధానం చెబుతాం.