PM Modi Meditation Break: ప్రధాని నరేంద్రమోదీ గురువారం తమిళనాడులోని కన్యాకుమరి వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని రెండు రోజులపాటు గడపనున్నారు. భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రధాని మోదీ సుమారు 45 గంటల సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ఈ సందర్భంగా వివేకానంద స్మారక మండపం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2000 మంది పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ రాక్ మెమోరియల్ వద్ద భద్రతా విధులు నిర్వహించనున్నారు. ధ్యానం అనంతరం జూన్ 1న రాక్ మెమోరియల్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా స్మారక చిహ్నం పక్కనే ఉన్న తిరువల్లువర్ విగ్రహాన్ని మోదీ సందర్శించే అవకాశం ఉంది. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. స్వామి వివేకానందరకు నివాళులర్పించిన అనంతరం రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యానం చేస్తారని తెలిపారు.
ముగిసిన ఎన్నికల ప్రచారం
దేశంలో చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు గురువారంతో ముగిసింది. ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. అక్కడ సుమారు రెండు రోజుల పాటు ధ్యానం చేస్తారు. 2019 ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ కేదార్ నాథ్‌కు వెళ్లి అక్కడ రుద్ర గుహలో ధ్యానం చేశారు. అంతకుముందు 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. తాజాగా తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు.
కన్యాకుమారికి స్వామి వివేకానందకు సంబంధం ఏంటి?
కన్యాకుమారిలో స్వామి వివేకానందకు భారత మాత దర్శనం కలిగిందని చెబుతారు. స్వామి వివేకానంద 1893లో ప్రపంచ మతాల మండలిలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేముందు 1892 డిసెంబర్ 24న కన్యాకుమారిని సందర్శించారని ప్రచారంలో ఉంది. సముద్ర తీరానికి దాదాపు 500 మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ బండ కనిపించింది. స్వామి వివేకానంద ఈదుకుంటూ అక్కడికి చేరుకుని ధ్యానంలో మునిగిపోయారు.
భారతమాత దర్శనం
వివేకానంద ధ్యానం చేస్తుండగా భారత మాత దర్శనం ఇచ్చిందని ప్రతీతి. అందుకే విశ్వఖ్యాతి సంపాదించి నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశాన్ని ధ్యాన్ మండపం అని పిలుస్తారు. 1970లో ఇక్కడ స్మారక భవనాన్ని నిర్మించారు. ఇందులో నాలుగు మంటపాలు ఉన్నాయి. దీని నిర్మాణం పురాతన శైలిలో ఉంటుంది. దీని 70 అడుగుల ఎత్తైన గోపురం ఎరుపు, నీలం గ్రానైట్‌తో నిర్మించారు. ఈ స్థలం 6 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ కంచుతో చేసిన ఎనిమిదిన్నర అడుగుల ఎత్తున్న స్వామి వివేకానంద పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
చారిత్రాత్మక నేపథ్యం
ఈ రాయికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం సముద్రపు నీటిలో ఉన్న ఈ రాతిపై కన్యాకుమారి దేవి శివుడిని పూజిస్తూ తపస్సు చేసిందని ఇక్కడి వారు చెబుతారు. అందుకే ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. ఇక్కడ నిర్మించిన స్మారక భవనంలో నమస్తుభ్యం, జగదాంబ అనే అసెంబ్లీ హాలు, సభా మండపం ఉన్నాయి. ఈ స్మారక చిహ్నం ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది.