ఒకరేమో ప్రపంచంలో అత్యంత ప్రభావిత వ్యక్తికి సోదరి. మరొకరు ఇండియాలో అత్యంత ప్రభావితమైన వ్యక్తికి చెల్లెలు. వీరిద్దరూ ఒక చోట కలిశారు. వీరే ప్రధాని నరేంద్ర మోదీ చెల్లెలు వాసంతి బెన్, మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి శశి దేవి. వీరు ఉత్తరాఖండ్‌లో కొఠారి వద్ద కలుసుకున్నారు. వారిద్దరు సాధారణ జీవితం గడుపుతున్న మహిళలే. చాలా నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఇండియాలోనే అత్యంత శక్తి వంతులకు చెల్లెల్లు అయిన ఈ ఇద్దరిని చూస్తే వీరేంటి ఇంత సింపుల్ గా ఉన్నారు అనిపిస్తుంది.? అసలు వీరు ఆ స్థాయిలో ఉన్న నేతలకు సోదరీమణులు అవుతారా అనే అనుమానం సైతం వస్తుంది.  


బీజేపీ తరఫున దేశంలో ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తారు. దేశంలో బీజేపీ ట్రెండ్ సెట్టర్ లీడర్లుగా పేరు తెచ్చుకున్న ఈ నాయకుల కుటుంబాల నేపథ్యం చాల కొద్ది మందికే తెలుసు. ఇప్పుడున్న కాలంలో చోటా నాయకుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వారి బంధువులు కుటుంబ సభ్యులు చేసే హాడావిడి అంతా ఇంతా కాదు. తమ హంగు ఆర్భాటం, దర్పం ప్రదర్శిస్తూ తమ ప్రత్యేకతను చూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది ప్రధాని మోదీ, యోగీల కుటుంబ సభ్యుల తీరు. తమ వారి అధికారాలను ఉపయోగించుకోకుండా సొంత కాళ్ల మీద జీవిస్తుంటారు. సాధారణ ప్రజలతో కలిసి జీవిస్తూ తమ కుటుంబాల బాగోగులు చూసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 


అపూర్వ కలయిక
ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతిబెన్, సీఎం యోగి సోదరి శశిదేవీ ఇద్దరు కలుసుకున్న అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఉత్తరఖండ్ లోని నీలకంఠ ధామ్‌కు నరేంద్ర మోడీ సోదరి వాసంతి బెన్, ఆమె భర్త వెల్లారు. శ్రావణ మాసం సందర్భంగా దైవ దర్శనానికి వెల్లిన వాసంతి బెన్ కొఠారిలోని ఓ దేవాలయం సమీపంలో ఉత్తరప్రదేశ్ సీం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవి నడుపుతున్న షాపు వద్దకు వెళ్లి కలిశారు. వీరిద్దరు కలుసుకుని అప్యాయతలు పంచుకున్నారు. శశిదేవి షాపులోని ఓ చెక్క బల్లపై కూర్చుని మాట్లాడుకున్నారు. కుటుంబ యోగ క్షేమాలు, పిల్లల గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని సోదరి వాసంతీ బెన్ గుజరాత్ లోని వీస్ నగర్ లో నివసిస్తున్నారు. ఆమె భర్త ఎల్ఐసీలో ఉద్యోగం చేసి రిటైర్ కావడంతో అక్కడే సాదా సీదా జీవనం సాగిస్తున్నారు.


ఉత్తారఖండ్‌లోని కొఠారి వద్ద శశి దేవి పూజా సామాగ్రిని విక్రయించే దుకాణాన్ని నడుపుతున్నారు. ఆమె భర్త చిన్న టీ దుకాణం నడుపుతున్నాడు. శశిదేవి, వాసంతి బెన్ కలుసుకుని మాట్లాడుకుంటున్న వీడియోను పంచుకుంటూ అజయ్ నందా అనే బీజేపీ నాయకుడు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. శశిదేవి, వాసంతీ బెన్ సమావేశం సరళత, భారతీయ సంస్కృతి, సంప్రదాయం సారాంశాన్ని ఉదాహరణగా చూపుతుందంటూ అభిప్రాయపడ్డారు. యూపీ సీఎం ఉత్తరాఖండ్‌కు చెందినవారు. ఆయన కుటుంబం ఇప్పటికీ పౌరి జిల్లా పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు.