PM Modi Rajasthan Visit:
గహ్లోట్ స్పీచ్ తొలగింపు..!
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలున్న నేపథ్యంలో ఆయన పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. సికార్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ ప్రసంగించాల్సి ఉంది. అయితే...ప్రధాని మోదీ కార్యాలయం ఆయన స్పీచ్‌ని తొలగించిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గహ్లోట్. మూడు నిముషాల పాటు మాట్లాడేందుకు షెడ్యూల్ చేశారని, కానీ తనను మాట్లాడనివ్వలదేని మండి పడ్డారు. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు.
"ప్రధాని మోదీజీ..మీరు ఇవాళ రాజస్థాన్ పర్యటనకు వస్తున్నారు. నా ప్రసంగంతో మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం ఎలాగో మీరు ఇవ్వలేదు. అందుకే...మీకు ఈ ట్వీట్ ద్వారా వెల్‌కమ్ చెబుతున్నాను"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ సీఎం
అయితే..ఈ ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించింది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్‌ని ఆహ్వానించినట్టు ట్వీట్ చేసింది. గహ్లోట్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చింది.
"ప్రోటోకాల్ ప్రకారం మిమ్మల్ని ఆహ్వానించాం. ప్రసంగించేందుకు ప్రత్యేకంగా ఓ టైమ్ షెడ్యూల్ కూడా పెట్టాం. మీరు హాజరు కాలేరని మీ ఆఫీస్ నుంచి మాకు సమాచారం అందింది. గతంలో ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటనకు వచ్చినప్పుడు మీరు వచ్చారు. ఇవాళ కూడా మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తున్నాం. ప్రతి అభివృద్ధి పనిలోనూ మీ భాగస్వామ్యం ఉంది. మీరు కాస్త అనారోగ్యంగా ఉన్నారని తెలిసింది. మీకు ఇబ్బందిలేకపోతే నిరభ్యంతరంగా రావచ్చు"
- ప్రధాని కార్యాలయం
ఆ తరవాత అశోక్ గహ్లోట్ మరో ట్వీట్ చేశారు. కాలు నొప్పి కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేనని, తనకు బదులుగా కొంత మంది మంత్రులను పంపుతానని ప్రధాని కార్యాలయానికి చెప్పినట్టు ట్వీట్ చేశారు.
"కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే మా ఆఫీస్ నుంచి సమాచారం అందింది. కాలికి గాయం కావడం వల్ల వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అందుకే...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమానికి హాజరవుతానని చెప్పాం. నా బదులు మంత్రులు అక్కడికి వస్తారు. రాజస్థాన్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
Also Read: ఈ ఏడాది ఉచిత హామీలు నెరవేర్చడం కష్టమే, నిధుల్లేవు దయచేసి ఓపిక పట్టండి - డీకే శివకుమార్