PM Modi PTI Interview: 


PTIతో స్పెషల్ ఇంటర్వ్యూ 


ప్రధాని నరేంద్ర మోదీ PTI వార్తాసంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. G20 గురించి ప్రస్తావించిన ఆయన...ఈ సదస్సుతో భారత్‌ విజన్ ఏంటో ప్రపంచానికి అర్థమవుతుందని వెల్లడించారు. భారత్‌ని ప్రపంచ దేశాలు భవిష్యత్‌కి రోడ్‌మ్యాప్‌లా పరిగణిస్తున్నాయని అన్నారు. గతంలో అన్ని దేశాలూ GDP గురించి మాత్రమే ఆలోచించేవని, ఇప్పుడు క్రమంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ విషయంలో భారత్‌ కూడా ముందంజలో ఉందని స్పష్టం చేశారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదం కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచానికీ దిక్సూచిగా మారిందని అన్నారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ "అభివృద్ధి చెందిన దేశం"గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విపక్షాలను ఉద్దేశించి సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. భారత్‌లో ఇకపై అవినీతికి, కుల రాజకీయాలకు తావు ఉండదని తేల్చి చెప్పారు. ఇలాంటి వాటికి దేశంలో చోటు ఉండదని అన్నారు. 


"త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసం మాకుంది. వచ్చే వెయ్యేళ్ల పాటు గుర్తుండే విధంగా అభివృద్ధి చేపట్టాలి. అందుకు ప్రజలు కూడా భాగస్వాములవ్వాలి. ఈ పురోగతికి వాళ్లే పునాది వేయాలి. చాలా ఏళ్ల పాటు భారత్‌ని ఆకలి దేశంగానే చూశారు. కానీ...ఇప్పుడు వంద కోట్ల మంది ఆలోచనలను ప్రతిబింబించే దేశంగా చూస్తున్నారు. ఇక్కడి ప్రజల నైపుణ్యాలను ప్రపంచం గమనిస్తోంది. G20 సదస్సు ద్వారా భారత్‌ విజన్‌ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసేందుకు వీలవుతుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ 







ఇదే ఇంటర్వ్యూలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఏ రెండు ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తినా... చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. G20 మీటింగ్స్‌ని కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించడై పాకిస్థాన్, చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. దీనిపై ప్రధాని స్పందించారు. దేశంలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహించడం సహజమే అని, దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. సైబర్ నేరాలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు ప్రధాని. సైబర్ ఉగ్రవాదంపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. డార్క్‌వెబ్‌, క్రిప్టో కరెన్సీ, మెటావర్స్‌ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉగ్రవాదులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో ఫేక్ న్యూస్ గురించీ మాట్లాడారు. ఇలాంటి వార్తల వల్ల న్యూస్ సోర్సెస్‌పై ప్రజలకు నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు.