Pahalgam Attack Anniversary: న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతోంది. పహల్గామ్ దాడి ఏడాది సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతులను స్మరించుకుంటూ, వారిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఏ రకమైన ఉగ్రవాదానికైనా భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావని, ఈ కష్ట సమయంలో అమరులైన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘గతేడాది ఇదే రోజున (ఏప్రిల్ 22న) పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పౌరులను గుర్తు చేసుకుంటున్నాను. ఆ ఘటనను, అమరులైన వారిని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ విచారకర సమయంలో బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను. మనమంతా ఒక దేశంగా ఈ కష్టకాలంలో దృఢ సంకల్పంతో ఒక్కటిగా ఉన్నాం. భారత్ ఎలాంటి ఉగ్రవాదానికైనా ఎప్పటికీ తలవంచదు. ఉగ్రవాదుల కుట్రలు భారత్ ఛేదిస్తుంది. ఉగ్రవాడుల పన్నాగాలు ఎన్నటికీ నెరవేరవు’ అని పేర్కొన్నారు.
మృతుల జ్ఞాపకార్థం పహల్గామ్‌లో స్మారక నిర్మాణంపహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా.. వీరిలో ఒకరు విదేశీయుడు ఉన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లిద్దర్ నది ఒడ్డున నల్లరాతితో నిర్మించిన ఈ స్మారకంపై 26 మంది మృతుల పేర్లు చెక్కారు. ఈ భయానక ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో భద్రతను కూడా పెంచారు.
మతం అడిగి మరీ కాల్చి చంపిన ఉన్మాదులు 2025 ఏప్రిల్ 22న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీకి విహారానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ప్రజల పేర్లు, మతం అడిగి తెలుసుకుని, మహిళలు, పిల్లల ముందే వారిని కాల్చి చంపేశారు. మీ మోదీకి చెప్పుకోండి అని అంటూ అమాయకుల్ని కాల్చి చంపడాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు, పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పీఓకే, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత ప్రభుత్వం పేర్కొంది. 2025 జూలై 28న 'ఆపరేషన్ మహాదేవ్' కింద పహల్గామ్‌లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.
