2002 Godhra Riots:
2002లో గోద్రా అల్లర్లు..
2002లో జరిగిన గోద్రా అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన జరిగిన సమయానికి తనకు ముఖ్యమంత్రిగా పెద్దగా అనుభవం లేదని, కానీ ప్రజల్ని పూర్తిగా నమ్మినట్టు వెల్లడించారు. కొంతమంది రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేశారని, కానీ ఇప్పుడు గుజరాత్ రూపురేఖలే మారిపోయాయని స్పష్టం చేశారు. కొందరు రాష్ట్రవ్యాప్తంగా విద్వేషాలు ప్రచారం చేయాలని చూశారని అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించడం వల్లే ఇప్పుడు ఆ ఘటన నుంచి రాష్ట్రం కోలుకోగలిగిందని వెల్లడించారు. Vibrant Gujarat Summit కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చాలని కుట్ర చేశారు. విద్వేషాలు ప్రచారం చేశారు. 2002లో గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో నాకు ముఖ్యమంత్రిగా పెద్దగా అనుభవం లేదు. కానీ గుజరాత్ ప్రజలపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాను. గుజరాత్‌ని ముక్కలు చేయాలని కొందరు చూశారు. కానీ మా ప్రభుత్వం ఆ కుట్రని భగ్నం చేసింది. అభివృద్ధిపై దృష్టి పెట్టి ఇప్పుడీ స్థాయిలో రాష్ట్రాన్ని నిలబెట్టింది"
- ప్రధాని నరేంద్ర మోదీ
వైబ్రంట్ గుజరాత్‌తో రాష్ట్ర ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగామని వెల్లడించారు ప్రధాని మోదీ. ప్రపంచంతో ముఖాముఖి మాట్లాడే స్థాయిలో ధైర్యం తీసుకురాగలిగామని వివరించారు. గత ప్రభుత్వాలు రాజకీయాలు చేసి గుజరాత్ అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. విదేశీపెట్టుబడులు రాకుండా కుట్ర చేశారని కాంగ్రెస్‌పై మండి పడ్డారు.
"గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గుజరాత్ అభివృద్ధిని రాజకీయాలతో ముడి వేసింది. ఒక్క కేంద్రమంత్రి కూడా గుజరాత్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపించంలేదు. విదేశీపెట్టుబడులు రాకుండా వాళ్లను బెదిరించే వాళ్లు. గుజరాత్‌కి రాకుండా అడ్డుకునే వాళ్లు. ఇన్ని బెదిరింపులకు పాల్పడినా విదేశీపెట్టుబడిదారులు గుజరాత్‌కు వరుస కట్టారు"
- ప్రధాని నరేంద్ర మోదీ