క్వాడ్ సమ్మిట్ 2022 సందర్భంగా టోక్యోలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంపై ఇరువురు ముఖ్యులు చర్చించారు. యుఎస్ ప్రెసిడెంట్‌తో చాలా సహృద్భావ వాతావరణంలో ఫలవంతమైన చర్చలు విస్తృతంగా జరిగాయని, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణతోపాటు ప్రజల మధ్య సంబంధాలపై చర్చించినట్టు ప్రధాని మోదీ వివరించారు. 


భారత్‌, యుఎస్ మధ్య ఉన్న వ్యూహాత్మక రిలేషన్‌షిప్‌ నిజంగా "విశ్వాసంతో కూడుకున్న భాగస్వామ్యం" అని, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉపయోగపడేలా "మంచికోసం పని చేసే శక్తి"లా కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.


" భద్రత, సహా ఇతర చాలా రంగాల్లో మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం... విశ్వాసంతో మరింత బలపడింది. రెండు దేశాల ప్రజల ఉన్న రిలేషన్ ఆర్థిక సంబంధాన్ని విశిష్టమైనదిగా మార్చేస్తుంది." అని మోదీ పేర్కొన్నారని పీటీఐ తెలిపారు.


ఇరుపక్షాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు విస్తరిస్తున్నాయని.. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని.


"మా మధ్య కుదిరిన భారత్-అమెరికా పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం కచ్చితమైన పురోగతి సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మేము సాంకేతిక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకుంటున్నాం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి  సమన్వయం మరింత పెంచే దిశగా ఆలోచన చేస్తున్నాం" అని మోదీ అన్నారు.


భారత్‌, అమెరికాది ఒకే ఒకే దృక్పథం: ప్రధాని మోదీ


ఇండో-పసిఫిక్ ప్రాంతం గురించి అమెరికా, భారత్‌ రెండూ ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక స్థాయిలోనే కాకుండా ఇతర భావసారూప్యత కలిగిన దేశాలతో కూడా భాగస్వామ్య విలువలు, ఉమ్మడి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తున్నాయని మోదీ చెప్పారు.


"నిన్న ప్రకటించిన క్వాడ్, ఐపిఇఎఫ్ (ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ) దీనికి చక్కని ఉదాహరణలు. నేటి చర్చలు ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది" అని మోదీ అన్నారు.


భారత్‌, అమెరికా స్నేహం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి, భూసుస్థిరతకు, మానవజాతి శ్రేయస్సు చాలా ఉపయోగకరం. ఇది మరింత మంచి శక్తిగా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని మోదీ అన్నారు.


ఇరువురు నేతలు అనేక విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం-అమెరికా మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందించే మార్గాల గురించి చర్చించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.


భూమిపైనే అత్యంత బలమైన బంధంగా మారుస్తాం: జో బైడెన్


ప్రధాని మోదీతో తన సమావేశం గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ... భూమిపై అత్యంత సన్నిహితంగా భారత్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి తాను కట్టుబడి ఉన్నానని, రెండు దేశాలు కలిసి చేయగలిగేవి చాలా ఉన్నాయని చెప్పారు.


కరోనా టైంలో టీకా తీసుకొచ్చేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను కూడా బిడెన్ ప్రశంసించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలకు మద్దతుగా యుఎస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని ప్రశంసించారు. ఇండో-యుఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్‌ను పునరుద్ధరించడానికి అంగీకారం తెలిపినట్టు అమెరికా అధ్యక్షుడు ధృవీకరించారు.


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అంశం, దాడి ప్రభావం, మొత్తం ప్రపంచ వ్యవస్థపై దాని ప్రభావం గురించి ఇద్దరు నాయకులు చర్చించారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఈ ప్రతికూల ప్రభావాలను ఎలా తగ్గించాలనే దానిపై అమెరికా-భారత్ సంప్రదింపులు జరుపుతున్నాయని బైడెన్ చెప్పారు.