న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లాతో మాట్లాడారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడు శుభాన్షు శుక్లాతో శనివారం నాడు ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ISSలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించినందుకు యాక్సియం 4 గ్రూప్ కెప్టెన్ అయిన శుభాన్షు శుక్లాకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. "మీరు భారతదేశానికి చాలా దూరంలో ఉండొచ్చు, కానీ ప్రజల హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు" అని శుభాన్షు శుక్లాతో మోదీ అన్నారు.
ఈ అంతరిక్ష యాత్ర ఒక కొత్త శకానికి నాందిగా పేర్కొన్న ప్రధాని మోదీ ఇలా అన్నారు: "ఈ సమయంలో, మన ఇద్దరం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ 140 కోట్ల మంది భారతీయుల భావాలు నాతో ఉన్నాయి. నా స్వరంలో భారతీయులందరి ఉత్సాహం, ఆలోచనలు కలగలిసి ఉన్నాయి. అంతరిక్షంలో భారత జాతీయ పతకాన్ని ఎగురవేసినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. మీ మిషన్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ శుభాన్షు శుక్లాకు శుభాకాంక్షలు’ తెలిపారు.
శుభాన్షు శుక్లా ఆరోగ్యం, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. అందుకు తాను బాగానే ఉన్నానని, సురక్షితంగా ఉన్నానని గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సమాధానం ఇచ్చారు. ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి తన అనుభవాలను పంచుకున్నారు. "నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీకి, 140 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు. ఐఎస్ఎస్‌లో చాలా బాగుంది. ఇదో కొత్త అనుభూతి. నేను చాలా సంతోషంగా, సురక్షితంగా ఉన్నాను. భూమి నుంచి ఐఎస్ఎస్ వరకు నా ప్రయాణం కేవలం నా ఒక్కడిదే కాదు, దేశం చేసిన జర్నీ" అని శుభాన్షు శుక్లా ప్రధాని మోదీతో అన్నారు.
భారతదేశం చాలా అందంగా, గొప్పగా కనిపిస్తుంది
భారతదేశం పటంలో కనిపించే దానికంటే "చాలా గొప్పగా" కనిపిస్తుందని, చాలా పెద్దగా ఉందని భారత వ్యోగమగామి శుభాన్షు శుక్లా తన అంతరిక్ష అనుభవాన్ని పంచుకున్నారు. ఇక్కడి నుంచి మొదటగా భూమిని చూశాను. భూమిని చూసిన తరువాత, మొదటి ఆలోచన ఏమిటంటే భూమి పూర్తిగా ఒకటిగా కనిపిస్తుంది. బయటి నుండి ఎలాంటి సరిహద్దులు కనిపించవు. ఐఎస్ఎస్ నుంచి మొదటిసారిగా భారతదేశాన్ని చూసినప్పుడు, చాలా గొప్పగా, చాలా పెద్దగా కనిపిస్తుంది. నార్మల్ మ్యాప్ మీద చూసే దానికంటే చాలా పెద్దగా అనిపించింది’ అని శుక్లా తెలిపారు. "మనం భూమిని అంతరిక్షం నుంచి చూసినప్పుడు, సరిహద్దులు లేనట్లు, దేశాలు లేనట్లు అనిపిస్తుంది. భూమి మన అందరికీ ఇల్లు లాంటిది. అందులోనే మనమందరం ఉన్నాము" అని అన్నారు.
"నేను చిన్నతనంలో వ్యోమగామిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే, మీ నాయకత్వంలో, దేశం తన కలలను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది" అని శుక్లా అన్నారు.
యాక్సియం 4 స్పేస్ మిషన్‌లో భాగంగా బుధవారం నాడు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ISSకి వెళ్లి చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ రష్యన్ వ్యోమనౌకలో ప్రయాణించిన 41 సంవత్సరాల తర్వాత మరో భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి.
శుక్లా గజర్ కా హల్వా, ఆమ్రస్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు
అంతరిక్షంలోకి తీసుకెళ్లిన 'గజర్ కా హల్వా'ను తోటి వ్యోమగాములతో పంచుకున్నారా అని ప్రధాని మోదీ అడిగారు. దీనికి వ్యోమగామి శుభాన్షు శుక్లా సమాధానమిస్తూ: "అవును. నేను గజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా, ఆమ్రస్ వంటి కొన్ని సాంప్రదాయ భారత ఆహార పదార్థాలను నా వెంట తెచ్చాను. ఇతర దేశాల నుండి వచ్చిన తోటి వ్యోమగాములకు మన వంటల గొప్పతనాన్ని రుచి చూడాలని కోరాను" అన్నారు.
శుక్లాతో జరిగిన సంభాషణలో, అంతరిక్షంలోని పరిస్థితుల గురించి మరియు ఆయన ఎలా అలవాటు పడుతున్నారనే దాని గురించి కూడా ప్రధాని మోదీ అడిగారు.
దీనికి ఆయన సమాధానమిస్తూ: "ఇక్కడ ప్రతిదీ భిన్నంగా ఉంది. మేము ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నాము మరియు నేను వివిధ వ్యవస్థల గురించి తెలుసుకున్నాను... కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత, ప్రతిదీ మారిపోయింది... ఇక్కడ, చిన్న విషయాలు కూడా భిన్నంగా ఉంటాయి ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేదు... ఇక్కడ నిద్రపోవడం ఒక పెద్ద సవాలు... ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది."
భూమి నుండి 28 గంటల ప్రయాణం తర్వాత, స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేష్ షటిల్ 'గ్రేస్' జూన్ 27న ఉదయం 6:21 గంటలకి ISS హార్మనీ మాడ్యూల్‌తో అనుసంధానం (డాకింగ్) అయింది. సిబ్బంది అధికారికంగా ఉదయం 8:23 కి ISS లోకి ప్రవేశించారు. నాసాకు చెందిన ఎక్స్‌పెడిషన్ 73 సిబ్బంది స్వాగతం పలికారు. శుక్లా అధికారికంగా స్పేస్ స్టేషన్ పిన్‌ను పొందారు, ISSకి ప్రయాణించిన 634వ వ్యోమగామిగా గుర్తింపు పొందారు. Ax-4 టీం ISSలో సుమారు 14 రోజులు గడుపుతుంది. ఎక్స్‌పెడిషన్ 73 సిబ్బందితో కలిసి వివిధ పరిశోధనా ప్రాజెక్ట్‌లపై పని చేస్తుంది.