Narendra Modi: ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ రోజూ పార్లమెంట్‌కు వస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు.  ఈ సందర్భంగా పార్లమెంట్‌లో మోదీ సందడి చేస్తున్నారు. బీజేపీ ఎంపీలతోనే కాకుండా ఇతర పార్టీ ఎంపీలను కూడా పలకరిస్తూ వారితో ముచ్చటిస్తున్నారు. ఇతర పార్టీల ఎంపీలతో కలిసి భోజనం కూడా చేస్తూ మోదీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం వేర్వేరు పార్టీలకు చెందిన ఎనిమిది ఎంపీలకు మోదీ సర్‌ప్రైజ్  ఇచ్చారు. తనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని ఎనిమిది మంది ఎంపీలకు కల్పించారు. వీరిలో బీజేపీతో పాటు వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. వీరిలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీజేడీ ఎంపీ సుస్మిత్, బీఎస్సీ ఎంపీ రితేష్ ఇతర పార్టీలకు చెందినవారు కాగా.. మిగతావారిలో బీజేపీ ఎంపీలు హీనా గవిత్, ఫాంగ్నాన్ కొన్యాక్, నామ్‌గ్యాల్, మురుగున్ ఉన్నారు.


మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రధాని మోదీ నుంచి వీరికి కబురు వచ్చింది. ప్రధాని మిమ్మల్ని కలవాలనుకుంటున్నారంటూ అధికారుల నుంచి ఈ ఎనిమిది మంది ఎంపీలకు సమాచారం వచ్చింది. దీంతో ఎంపీలకు ఏమైందో అర్థం కాక వెంటనే ప్రధాని కార్యాలయానికి పరుగులు పెట్టారు. కార్యాలయం లోపలికి వెళ్లి మోదీని కలిశారు. ఎంపీలను చూసిన మోదీ.. పదండి.. మీ అందరికి శిక్ష విధించాలి అంటూ పార్లమెంట్‌లోని క్యాంటిన్‌కు తీసుకెళ్లారు. మోదీ ఎందుకు తీసుకొచ్చారో తెలియక ఎంపీలు కాసేపు టెన్షన్ పడ్డారు. అయితే వారితో కలిసి భోజనం చేసిన మోదీ.. దీనికి సంబంధించిన ఫొటోలను తన అధికారిక 'ఎక్స్' అకౌంట్‌లో పోస్ట్ చేశారు.  దేశంలోని వివిధ పార్టీలకు చెందిన సహచర ఎంపీలతో కలిసి భోజనం చేయడం సంతృప్తికరంగా ఉందని మోదీ పేర్కొన్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మోదీ తమతో కలిసి భోజనం చేయడంతో ఎంపీలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీలు కూడా సోషల్ మీడియతో మోదీతో కలిసి లంచ్ చేసిన ఫొటోలను షేర్ చేశారు. మోదీతో కలిసి భోజనం చేయడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు.


లంచ్ చేస్తున్న సమయంలో ఎంపీలతో విదేశీ పర్యటనలు, పలు అంశాలపై మోదీ చర్చించారు. తన బిజీ షెడ్యూల్స్, గుజరాత్ రాష్ట్రం గురించి మాట్లాడారు. అలాగే 2015లో ఎస్‌పీజీ అభ్యంతరం చెప్పినప్పటికీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన విషయాన్ని ఎంపీలకు వివరించారు.  దాదాపు అరగంట పాటు ఎంపీలతో మోదీ మాట్లాడారు. భోజనానికి అయిన ఖర్చును మోదీనే చెల్లించారు. 


అటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. 10వ తేదీన ఎంపీలందరూ సమావేశాలకు హాజరుకావాలని సూచించింది. ఆ రోజున ఉభయసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో తప్పనిసరిగా సభలకు హాజరై ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఎంపీలకు సూచించింది. ఇక ఇటీవల పార్లమెంట్‌లో 60 పేజీల శ్వేతపత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్దిని వివరించారు.