Modi Comments on Bharataratna to Ambedkar: పార్లమెంటు ఎన్నికలకు (General Elections 2024) సమయం చేరువ అవుతున్న కొద్దీ కేంద్రంలో రాజకీయం వేడెక్కడం (Political heat) ప్రారంభమైంది. మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా నిర్ణయించుకున్న బీజేపీ (BJP) అగ్రనేతలు.. కాంగ్రెస్ పార్టీ (Congress party)ని చెడమడా ఏకేస్తున్న వైనం కళ్లకు కడుతోంది. ఈ క్రమంలో కాదేదీ అనర్హం.. అన్నట్టుగా అన్ని అంశాలను ప్రణాళికా యుతంగా తెరమీదికి తెస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఐకాన్‌గా భారత రాజ్యాంగ నిర్మాతగా సుస్థిర కీర్తిని సొంతం చేసుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ కేంద్రంగా ఈ ఒక్క విషయంపైనే బుధవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సుమారు.. 10 నిమిషాల పాటు ప్రసంగించిన తీరు.. చర్చనీయాంశం అయింది.
మోదీ వ్యాఖ్యలు ఇవీ..
``బాబా సాహెబ్ అంబేద్కర్(Ambedkar)కు సైతం భారత రత్న ఇచ్చేందుకు ఈ కాంగ్రెస్‌కు మనసు రాలేదు. అది మావల్లే అయింది. కానీ, తమ వంశ పరంపరకు మాత్రం భారత రత్నాలను ఇచ్చుకున్న ఘనతను తోసిపుచ్చలేరు`` అంటూ.. దివంగత ప్రధానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ., ఇందిరాగాంధీలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంటే.. ప్రదాని చెప్పిన దానిని బట్టి.. అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తే.. తామే ఆయనను భుజాన ఎక్కించుకుని భారత రత్నంగా తీర్చిదిద్దామని చెప్పారు.
క్రెడిట్ ఒకరిది..
అంతేకాదు.. అంబేద్కర్‌కు భారత రత్న(Bharatha ratna) ఇచ్చింది తామేనని పరోక్షంగా ఆయన ఆ క్రెడిట్‌ను బీజేపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రధాన మంత్రి ఏ ఉద్దేశంతో చెప్పారనే విషయాన్ని పక్కన పెడితే.. చరిత్ర పదిలమే కదా! అది ఎక్కడా తొణకదు కదా! ఈ చరిత్ర చెబుతున్న దాని ప్రకారం.. 1990 మార్చి 31వ తేదీనాడు అంబేద్కర్‌కు మరణానంతరం `భారతరత్న`ను అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్నది నేషనల్ ఫ్రెంట్. దీనికి సారథి.. ప్రధాని కూడా.. వీపీ సింగ్. ఈ విషయంలో కాంగ్రెస్ జోక్యం లేదన్నది వాస్తవమే. అదేసమయంలో బీజేపీ ప్రమేయం కూడా లేదన్నది మరో వాస్తవం.
వ్యూహం ఏంటి?
కానీ, ప్రధాని మోదీ వ్యూహం ఏంటి? అనేది చూస్తే.. వీపీ సింగ్(VP Singh) ప్రభుత్వం అప్పట్లో కలగూర గంప. దీనిలో ఏపీకి చెందిన తెలుగు దేశం పార్టీ(TDP) కూడా భాగస్వామిగా ఉంది. టీడీపీ ఇతర పార్టీలు నేరుగా వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే.. బీజేపీ వెలుపల నుంచి అంశాల వారీ మద్దతు ప్రకటించింది. ఇంతకు మించి.. ఆ పార్టీకి విధానపరమైన నిర్ణయాల్లో వీపీ సింగ్ కూడా వేలు పెట్టనివ్వలేదు. కానీ, ఇప్పుడు మోదీ మాత్రం.. అంబేద్కర్‌కు భారతరత్నను కాంగ్రెస్ ఇవ్వలేదు. తామే ఇచ్చామని చెప్పుకొచ్చారు. అది కూడా రాజ్యసభా వేదికపై!!
ఇప్పుడెందుకు తవ్వారు?
పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు కైవసం చేసుకోవాలని.. తద్వారా కాంగ్రెస్‌కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వరాదన్నది ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉత్తరాది కొన్ని రాష్ట్రాల్లోనూ ఎస్సీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. దీనిని భేదిస్తే.. తమవైపు తిప్పుకోగలిగితే.. మరింతగా కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టి .. ఆ పార్టీకి సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకును విచ్చిన్నం చేయాలనే రాజకీయ ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ``ఏ పార్టీ బలపడినా.. మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్‌తోనే తంటా`` అని కొన్నాళ్ల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యే దీనికి ఆలంబనగా మారింది. అందుకే.. అత్యంత కీలకమైన.. ఎస్సీ ఐకాన్‌గా మారిన అంబేద్కర్‌కు భారతరత్న వంటి అవార్డు వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చి.. చర్చ పెట్టడం ద్వారా.. కాంగ్రెస్ అనుకూల ఎస్సీ ఓటు బ్యాంకును బదాబదలు చేయాలనే వ్యూహమే కనిపిస్తోందన్నది పరిశీలకుల మాట. కానీ, చరిత్ర వాస్తవాలు మరుగునపడవు కాబట్టి.. దీనిని కాంగ్రెస్ అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.