India celebrates Ram Pran Pratishtha by lighting lamps: హైదరాబాద్: శబాద్ధాల కల నెరవేరింది. అయోధ్యలో తన జన్మ స్థానంలో రాముడు కొలువుతీరాడు. అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీపాలు వెలిగిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి భక్తులు అన్ని ప్రాంతాల్లో దీపాలు వెలిగిస్తున్నారు.  అయోధ్యలో సరయు నదీ తీరాన దీపోత్సవం నిర్వహిస్తున్నారు. 






ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దీపోత్సవంలో పాలు పంచుకున్నారు. ఢిల్లీలోని తన నివాసం ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు. శ్రీరాముడికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ప్రజలు రాముడి వేడుకను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


 






మధ్యప్రదేశ్ లో ప్రజలు దీపాల వేడుకలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. కొన్ని చోట్ల టపాసులు పేలుస్తూ బాలరాముడి ప్రాణప్రతిష్టను ఘనంగా జరుపుకున్నారు. పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి. భోపాల్ లో మంత్రి విశ్వాస్ సారంగ్ టపాసులు పేల్చి వేడుకల్లో పాల్గొన్నారు.






ఢిల్లీలో కేంద్ర మంత్రులు, నేతలు స్థానిక ప్రజలతో కలిస దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ దీపాలు వెలిగించి పండుగలా సెలబ్రేట్ చేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించగా, కొందరు జై శ్రీరామ్ అంటూ వీధుల్లో జెండాలు ప్రదర్శిస్తున్నారు.






అయోధ్య రామ మందిరం దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయం  వద్ద కార్యక్రమాన్ని వీక్షించారు. రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను దీపావళి పండులా లైట్లు అమర్చి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆలయం వద్ద నిర్వహించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ వ్యాప్తంగా ఎటు చూసినా జై శ్రీరామ్ , రామ నామం జపంతో మార్మోగిపోతోంది. 






ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దీపాలు వెలిగించి రాముడి వేడుకను దీపావళి పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భక్తులు ఆలయాలను దీపాలతో నింపేస్తున్నారు. టపాసులు కాల్చుతూ బాలరాముడి ప్రాణప్రతిష్టను పండుగలా జరుపుకుంటున్నారు.