PM Modi  On Trump Tariffs : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు టారిఫ్స్‌ బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ టైంలో ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లో పర్యటించిన మోదీ స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయని దీంతో మనంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అన్నారు. అయినా ప్రజల కోసం కచ్చితంగా దాన్ని భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

అహ్మదాబాద్‌లోని ఖోడల్‌ధామ్ మైదానంలో రూ. 5,400 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను  ప్రధానమంత్రి మోదీ ప్రారంభంచారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ ట్రంప్ సుంకాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలో ఆర్థిక స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి ఒక్కరూ తమ స్వలాభం కోసం చూస్తున్నారని, మనం దానిని స్పష్టంగా చూస్తున్నామని ఆయన అన్నారు.

'ఎంత ఒత్తిడి వచ్చినా, మన బలాన్ని పెంచుకుంటాం'

దేశంలోని రైతులు, పశుపోషకుల సంక్షేమమే తమకు అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. "నేను నా చిన్న వ్యాపారవేత్తలు, చిన్న దుకాణదారులు, రైతులు, పశుపోషకులకు చెబుతున్నాను, నేను గాంధీ నడయాడిన నేల నుంచి  మాట్లాడుతున్నాను, నా దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశుపోషకులు, మీ సంక్షేమం మోదీకి అత్యంత ముఖ్యమైనది. నా ప్రభుత్వం చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశుపోషకులకు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వదు. ఎంత ఒత్తిడి వచ్చినా, మేము దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటాము" అని ఆయన అన్నారు.

విదేశీ వస్తువులు ఎక్కువ ప్రోత్సహించొద్దని ప్రధాని పిలుపు

దేశ ప్రజలు భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. అలంకరణ వస్తువులు లేదా బహుమతులు అయినా, మన దేశంలో తయారైన వస్తువులను కొనాలని ఆయన అన్నారు. విదేశీ వస్తువులను అమ్మకుండా ఉండాలని ప్రధాని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "మా ప్రభుత్వం GST సంస్కరణలు చేస్తోంది. దీపావళికి ముందు మీకు పెద్ద బహుమతి లభిస్తుంది. GST సంస్కరణల కారణంగా, మా చిన్న పరిశ్రమలకు చాలా సహాయం అందుతుంది. చాలా వస్తువులపై పన్ను తగ్గుతుంది. ఈ దీపావళికి వ్యాపార వర్గం లేదా మా కుటుంబ సభ్యులైనా అందరికీ రెట్టింపు బోనస్ లభించనుంది" అని అన్నారు.

'భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం చూసింది'

ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ మాట్లాడుతూ, "పహల్గామ్‌పై దాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం చూసింది. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. ఆపరేషన్ సిందూర్‌ మన సైన్యం శౌర్యానికి ప్రతీకగా నిలిచింది. భారతదేశపు సంకల్పానికి చిహ్నంగా మారింది. గతంలో కూడా చాలా సార్లు వారు మన రక్తం కళ్లజూశారు, కాని అప్పట్లో ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కాని నేడు ఉగ్రవాదులను, వారి సూత్రధారులను మేము వదిలిపెట్టం, వారు ఎక్కడ దాక్కున్నా సరే పట్టుకుంటాం" అని అన్నారు.