PM Kisan Yojana 21st Installment | భారత ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana). ఈ పథకం దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక సహాయం కోసం రూపొందించారు. దీని ద్వారా రైతులు వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న అవసరాలను తీర్చుకోగలుగుతారు. ఈ కిసాన్ యోజన పథకం కింద, ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలో రూ.6 వేల ఆర్థిక సహాయం జమ చేస్తారు.
సంవత్సరానికి 3 వాయిదాలలో కేంద్రం ఆ నగదును అందిస్తుంది. ఈ సంవత్సరం 20వ వాయిదాను ఆగస్టు 2, 2025న విడుదల చేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని వరద ప్రభావిత లక్షలాది మంది రైతుల ఖాతాలో 21వ వాయిదా డబ్బులు ఇప్పటికే జమయ్యాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల రైతులు ఇప్పటికీ పీఎం కిసాన్ యోజన 21వ వాయిదా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వారి ఖాతాల్లో రూ.2000 జమ చేస్తుందా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు.
నవంబర్ మొదటి వారంలో వాయిదా రావచ్చా?
ప్రభుత్వం 4 నెలల వ్యవధిలో వాయిదాను పంపుతుంది. గత వాయిదాను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి అంటే 21వ వాయిదాను నవంబర్ నెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. దీపావళి సందర్భంగా పీఎం కిసాన్ నగదు ఖాతాల్లో జమ చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది.
తమ బ్యాంకు ఖాతా, ఆధార్, ఇతర వివరాలను అప్‌డేట్ చేసిన రైతులకు త్వరలో 21వ విడత పీఎం కిసాన్ నగదు లభించవచ్చు. తాజా విడత నగదు విడుదల చేయడానికి ముందు, ప్రభుత్వం పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని షేర్ చేస్తుందని మీకు తెలిసిందే. ఈసారి కూడా వాయిదా విడుదల చేయడానికి ముందు వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంచనుంది.
రైతులు రెండు పనులు చేయడం ముఖ్యం
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana)లో ప్రయోజనం పొందడానికి కేంద్ర ప్రభుత్వం 2 పనులు చేయడం తప్పనిసరి చేసింది. వీటిలో భూమి రికార్డుల ధృవీకరణ, E KYC ఉన్నాయి. ఈ రెండు ముఖ్యమైన పనులు చేయని రైతులకు తదుపరి వాయిదా నగదు రూ.2 వేలు లభించదు.
ఈ-కెవైసి చేయడం చాలా సులభం. దీని కోసం రైతులు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ని సందర్శించి ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. భూమి ధృవీకరణ కోసం, మీ రాష్ట్రంలోని అధికారిక భూ రికార్డుల పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ మీరు మీ భూమికి సంబంధించిన నిర్ధారణ చేయవచ్చు.