" గ్రాండ్ సన్ ఆఫ్ నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే ఎం.ఆర్ గాంధీ "  ఇదేదో హోదా అయినట్లుగా ఓ వ్యక్తి తన బైక్‌పై రాసుకుని తిరుగుతున్నాడు.  ఎక్కడో రాసుకుంటే సర్లే అదో  రకం అనుకునేవారు కానీ అతను నెంబర్ ప్లేట్‌పై నెంబర్లు తీసేసి.. ఇదే హోదాను రాసుకున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చాలా మంది దేశానికి పెద్ద దరిద్రం ఇదేనని తిట్టుకున్నారు. అయితే నాగ్‌కోయిల్ ఎమ్మెల్యే గురించి తెలిసిన వారు మాత్రం ఓ హిలేరియస్ నిజాన్ని బయట పెట్టారు. అదేమిటంటే..  నాగర్ కోయిల్ ఎమ్మెల్యే గాంధీ అసలు పెళ్లి చేసుకోలేదు.


 






తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గాంధీ పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన బ్రహ్మచారి అసలు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయనకు పిల్లలు.. మనవళ్లు ఉండే అవకాశం లేదు. దీంతో మరి లేని హోదాను నెంబర్ ప్లేట్‌మీద పెట్టుకుని మరీ తిరుగుతున్న  ఆ యువకుడు ఎవరు అని సోషల్ మీడియానే ఆరా తీసింది. చివరికి అతని పేరు అమ్రిష్ అని తేలింది. అతను కూడా నాగర్‌కోయిల్‌కు చెందినవాడే.  ఎమ్మెల్యే గాంధీకి అనుచరునిగా చెప్పుకునే కన్నన్ అనే వ్యక్తి కుమారుడుగా తేలింది. 


 






గాంధీకి అనుచరుడుగా ఉన్న వ్యక్తి కుమారుడు.. తన తన తాత గాంధీ అని చెప్పుకుని మరీ తిరుగుతూండటం నెటిజన్లకు మరింత సెటైరిక్‌గా విమర్శించడానికి అవకాశం చిక్కింది. గతంలో ఎన్డీ తివారీ అంశంలో జరిగిన ఉదంతాన్ని ఎత్తి చూపుతూ..  నెటిజన్లు విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడీ వ్యక్తి తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యారు. 


ఎమ్మెల్యేలు.. ఎంపీ కుమారులు.. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా నెంబర్ ప్లేట్లను కూడా మార్చేసి ఇలా హోదాలు.. కొటేషన్లు రాసుకుని రోడ్డెక్కడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు వీరు ప్రమాదాలు చేసి.. నెంబర్ ప్లేట్ కూడా లేకుండా ఉండటం వల్ల తప్పించుకు తిరుగుతూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉన్నా అదే పరిస్థితి. సామాన్యులు ఎవరైనా ఇలా నేమ్ ప్లేట్ తేడాగా పెట్టుకుని వెళ్తే ఇంటికి చేరే లోపు చలాన్ రెడీగా ఉంటుంది. బడాబాబులకు మాత్రం .. ఇలాంటి చట్టాలు వర్తించవు. అందుకే.. పెళ్లి కాని తాతకు మనవడ్ని కూడా బోర్డులు పెట్టేసుకుని తిరుగుతున్నారు.