Parliament Winter Session 2023: 


శీతాకాల సమావేశాలు..


శీతాకాల సమావేశాలు (Parliament Winter Session Updates) ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలు ఓటమిని పక్కన పెట్టి చర్చలకు సహకరించాలని కోరారు. ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్‌ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించొద్దని సూచించారు. డిసెంబర్ 3న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ కూడా కమల దళం వశమయ్యాయి. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని, విద్వేషాలు ప్రచారం చేయడం ఆపేయాలని స్పష్టం చేశారు. 


"ఎన్నికల ఫలితాల విషయానికొస్తే...ప్రతిపక్షాలకు ఇదో మంచి అవకాశం. ఈ సమావేశాల్లో అందరూ సహకరించాలి. ఓడిపోయామన్న బాధని, ఆక్రోశాన్ని సమావేశాల్లో చూపించడం సరికాదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సానుకూలంగా ముందుకెళ్లాలి. గత 9 ఏళ్లుగా నెగటివిటీని ప్రచారం చేసింది చాలు. ఇప్పటికైనా మారితే ప్రజల్లో ఈ పార్టీలపై ఉన్న అభిప్రాయం కొంతైనా మారుతుందని అనుకుంటున్నాను. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాకెంతో ఉత్సాహాన్నిచ్చాయి"


- ప్రధాని నరేంద్ర మోదీ


 






దేశ ప్రజలు నెగటివిటీని తిప్పికొట్టారని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఈ సమావేశాలు ప్రారంభం కాకముందే...ప్రతిపక్ష నేతలతో భేటీ అయినట్టు వెల్లడించారు. అందరూ శీతాకాల సమావేశాలకు సహకరించాలని కోరినట్టు చెప్పారు. లోక్‌సభ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని...ఇక్కజ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరముందని హితవు పలికారు.