Parliament Monsoon Session: మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో రగడ, మోదీ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం
Parliament Monsoon Session: లోక్‌సభలో విపక్షాలు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
రెండు సభలనూ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఆమోదించారు. దీనిపై ఎప్పుడు చర్చ జరగాలో త్వరలోనే నిర్ణయిస్తామని వెల్లడించారు.
రాజ్యసభలోనూ మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టడం వల్ల గందరగోళం నెలకొంది.
"మా పార్టీ తరపున ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రధాని మోదీ దీనిపై మాట్లాడి ఉంటే కొంత వరకైనా అలజడి తగ్గుతుంది. అందుకే...ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం"
- నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీ
అవిశ్వాస తీర్మానంపై మాణికం ఠాగూర్ స్పందించారు. INDIA కూటమి ఈ విషయంలో కలిసి పోరాడుతుందని తేల్చి చెప్పారు.
"INDIA కూటమి కలిసే ఉంటుంది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అంతా కలిసే నిర్ణయించుకున్నాం. ప్రధాని మోదీ గర్వాన్ని అణిచివేయాలన్నదే మా ఉద్దేశం"
- మాణికం ఠాగూర్
విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
మణిపూర్ విషయంలో మోదీసర్కార్ విఫలమైందని విమర్శించిన విపక్షాలు లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మణిపూర్ హింసాకాండపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Background
Parliament Monsoon Session:
జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, మణిపూర్‌లో చెలరేగిన జాతి హింసపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. కొందరు సభ్యులతో ఉన్న గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో మొదటి రోజు నుంచి లోక్ సభ, రాజ్యసభలో సమావేశం ప్రారంభం అయిన కొంత సమయానికే మరుసటి రోజుకు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో రూల్ 193 కింద మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు నోటీసులు ఇచ్చాయి.కాగా, రాజ్యసభలో ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చించేందుకు రూల్ 176, రూల్ 267 కింద నోటీసులు ఇచ్చాయి. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రెండోరోజు సమావేశాలలో చర్చ జరగాలని విపక్షాలు నినాదాలు చేయగా.. లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా లేవని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యతో దేశం సిగ్గుతో తల దించుకునేలా ఉందన్నారు.
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని వర్షాకాల సమావేశాలు 3వ రోజు (సోమవారం) సైతం విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్దంగా ఉన్నా, విపక్ష పార్టీలు సహకరించడం లేదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం సైతం వాయిదా పడ్డాయి. రాజ్యసభలో చైర్మన్ ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆప్ నేత సంజయ్ సింగ్‌ను ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇదే రోజు మూడు బిల్లులు - నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, 2023 మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023లను సభలో ప్రవేశపెట్టారు.
ఈ హింసపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయటే ఆందోళనలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా బీజేపీ వైఫల్యమే అని తేల్చి చెబుతున్నారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన బైరెన్ సింగ్ మరోసారి ఇదే విషయం వెల్లడించారు. రిజైన్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయనని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే ప్రసక్తే లేదు. కానీ కేంద్రం ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయను. ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీలో ఉన్నాను. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటించడం నా బాధ్యత. ప్రస్తుతానికి నా ముందున్న ఒకే ఒక లక్ష్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావడం. వీలైనంత త్వరగా పరిస్థితులు అదుపులోకి రావాలి. రాజీనామా చేయమని ఇంత వరకూ మా పార్టీ నాకు చెప్పలేదు."
- బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి
- - - - - - - - - Advertisement - - - - - - - - -