Parliament Monsoon Session Latest News | న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. జూలై 21నుంచి ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సెషన్ లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆర్థిక, పాలనా సంబంధిత ప్రతిపాదనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను బిల్లు, 2025పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పహాల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ యుద్ధం ఆపినట్లు చేస్తున్న ప్రకటనపై ప్రతిపక్షాలు చర్చకు పట్టు పట్టనున్నాయి.

ఆదాయపు పన్ను బిల్లును మొదట ఫిబ్రవరి 13న లోక్‌సభలో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనిని బిజెపి ఎంపి బైజయంత జయ పాండా నేతృత్వంలోని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ ఆమోదించింది. బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉంది, ఆ తర్వాతే ప్రస్తుత సమావేశంలో ఆమోదం కోసం తీసుకురానున్నారు.

సభలోకి రానున్న 8 కీలక బిల్లులు

ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్న మరో ప్రధాన బిల్లు మణిపూర్ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు, 2025. ఈ బిల్లు మణిపూర్ రాష్ట్ర జిఎస్‌టి చట్టాన్ని జాతీయ జిఎస్‌టి ఫ్రేమ్‌వర్క్‌తో సమన్వయం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి పునరుద్ధరించాల్సిన మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించే బిల్లును పార్లమెంటు పరిశీలించనుంది. జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2025ని కూడా ప్రవేశపెడతారు. ఈ చట్టం వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి, వ్యాపారాల కోసం కంప్లైయన్స్ విధానాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తుంది.

మొత్తం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే గత సమావేశాల నుండి పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులను కూడా తిరిగి పరిశీలిస్తారు. బిల్లుల జాబితాలో ఇవి ఉన్నాయి:

  • ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, 2024
  • ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు
  • ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024
  • గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య బిల్లు, 2024
  • ది మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2024
  • ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు, 2025
  • ఆదాయపు పన్ను బిల్లు, 2025
  • మణిపూర్ జిఎస్‌టి (సవరణ) బిల్లు, 2025
  • జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2025
  • ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు, 2025
  • ది టాక్సేషన్ లాస్ (సవరణ) బిల్లు, 2025
  • ది జియోహెరిటేజ్ సైట్స్ అండ్ జియో-రిలిక్స్ (ప్రిజర్వేషన్ అండ్ మెయింటెనెన్స్) బిల్లు, 2025
  • ది మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు, 2025
  • ది నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, 2025
  • ది నేషనల్ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లు, 2025

 ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలపై చర్చకు పట్టు

 ఇండియా కూటమి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు వర్షాకాల సమావేశాల్లో తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. 24 రాజకీయ పార్టీలు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో, ప్రతిపక్ష నాయకులు ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి, దాని పరిణామాలు, విదేశాంగ విధాన నిర్ణయాలపై ఆందోళనలపై చర్చకు డిమాండ్ చేయనున్నారు. ఓటింగ్ హక్కులకు ముప్పు వాటిల్లుతుందంటూ బిహార్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలను లేవనెత్తాలని నిర్ణయించారు.

భారత్-పాకిస్తాన్ మధ్య శత్రుత్వ సమయంలో 'యుద్ధ విరమణ' కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన ప్రకటనలు,  దానిపై ప్రభుత్వం "మౌనం" వహించిందంటూ లేవనెత్తనున్నారు. అదనంగా ఎస్‌సి/ఎస్‌టిలు, మహిళలు, మైనారిటీలను "లక్ష్యంగా చేసుకోవడం", అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి సమస్యలను లేవనెత్తాలని నిర్ణయించాయి.

విదేశాల్లో ప్రధాని మోదీ సరికాదు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో ఉండటం జాతీయ సమస్యలను పరిష్కరించడానికి అవసరమని కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారీ అన్నారు. ఆయన "విదేశాలకు వెళ్లడం కంటే పార్లమెంటు చాలా ముఖ్యం" అని అన్నారు. ఇండియా కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆగస్టులో సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత కె.సి. వేణుగోపాల్ కూడా ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ వంటి నేతలు శనివారం జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. కూటమిని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆన్‌లైన్ సమావేశానికి హాజరుకాలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్‌సిపి (ఎస్‌పి)కి చెందిన శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, డిఎంకె, ఆర్‌జెడి, టిఎంసి, సిపిఐ(ఎం), సిపిఐ, జెఎంఎంల ప్రతినిధులు ముఖ్యంగా పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో నిఘా వైఫల్యాలు, జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం, మరియు "ఇ-స్క్వేర్" రాజకీయ వ్యూహాలలో కేంద్ర సంస్థలు, ఎన్నికల సంఘాన్ని ఉపయోగించడం వంటి అనేక సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానంపై చర్చ కోరుకుంటున్నారు.